మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ మరో ప్లాంట్‌ | mic electronics another plant | Sakshi
Sakshi News home page

మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ మరో ప్లాంట్‌

Published Tue, Mar 21 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ మరో ప్లాంట్‌

మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ మరో ప్లాంట్‌

చైనా దిగ్గజం లేయార్డ్‌తో కలిసి ఏర్పాటు
భాగ్యనగరి వద్ద రూ.450 కోట్లతో


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎల్‌ఈడీ పరికరాల తయారీలో ఉన్న మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ హైదరాబాద్‌ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఎల్‌ఈడీ వీడియో డిస్‌ప్లేల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్‌–1 అయిన చైనా దిగ్గజం లేయార్డ్‌తో కలిసి దీనిని నెలకొల్పుతోంది. ప్లాంటు విషయమై చర్చించేందుకు లేయార్డ్‌తోపాటు యూఎస్‌ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ అనుబంధ కంపెనీ ప్లానర్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులు భాగ్యనగరికి ఈ వారమే వస్తున్నారు. 50 ఎకరాల్లో రానున్న ప్రతిపాదిత యూనిట్‌ ఏర్పాటుకు రూ.450 కోట్లకుపైగా వ్యయం చేసే అవకాశం ఉంది. 2018 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని 3 కంపెనీలు భావిస్తున్నాయి. ప్లాంటుకయ్యే వ్యయాన్ని లేయార్డ్‌ గ్రూప్‌ వెచ్చిస్తుంది. తయారీ ప్రక్రియను మిక్‌ చేపడుతుంది. మిక్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు ఉత్తరాఖండ్‌లో ప్లాంట్లు ఉన్నాయి.

పేటెంటు ఊపుతో..: మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇటీవలే ఎల్‌ఈడీ టీవీ డిస్‌ప్లే సిస్టమ్‌కు పేటెంటు దక్కించుకుంది. దీంతో ఇతర కంపెనీలు మిక్‌తో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రతిపాదిత కొత్త ప్లాంటులో స్మార్ట్‌ స్ట్రీట్‌ లైటింగ్, సోలార్‌ లైటింగ్, డిస్‌ప్లే ఉపకరణాలను తయారు చేస్తారు. డిస్‌ప్లేల విషయంలో ఒక్క భారత్‌లోనే ఏటా రూ.1,350 కోట్ల  వ్యాపారావకాశాలు ఉన్నాయని మిక్‌ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.1,20,000 కోట్లకుపైమాటే. కాగా, స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లను సరఫరా చేస్తున్నట్టు మిక్‌ ఎండీ ఎమ్వీ రమణారావు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లతో 72% విద్యుత్‌ ఆదా అవుతుందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.30 కోట్ల విలువైన సోలార్‌ స్ట్రీట్‌ లైట్ల సరఫరా తుది దశకు చేరుకుందన్నారు. మరో రూ.90 కోట్ల విలువైన లైట్లను మూడు నెలల్లో అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement