
సాక్షి,అమరావతి బ్యూరో: ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మిట్టపల్లి ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులోని ఐటీఏ కన్వెన్షన్ హాలులో జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశం గురువారం రాత్రి జరిగింది. సమావేశంలో 2018, 2019 సంవత్సరాలకు అధ్యక్షునిగా మిట్టపల్లి ఉమామహేశ్వరరావును మూడోసారి అ«ధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. ఈ ఎన్నిక ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది.
సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాతోపాటు గద్దె మంగయ్య, పొలిశెట్టి వెంకటేశన్, తాడిశెట్టి మురళి, కేబీఎంఎం కృష్ణలను ఉఫాధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. గౌరవ కార్యదర్శిగా కె.శాంతి భూషణ్, కోశాధికారిగా ఆర్.అయ్యవారయ్య, జాయింట్ సెక్రటరీలుగా లంక రామకృష్ణ ప్రసాద్, ఎస్.నాగేశ్వరరావు, రాయపాటి జగదీశ్, పి.కోటేశ్వరరావు, చుండూరి రవిబాబు ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మిట్టపల్లి ఉమమహేశ్వరరావు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ కార్యవర్గం తీసుకొనే నిర్ణయాలు, రైతులకు మేలు చేసేవిధంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment