కంచికచర్ల: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు తెరతీస్తోంది. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ లబ్ది పొందడానికి అశుభ కార్యాలయాలను కూడా ఉపయోగించుకొంటున్నారు. మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ తమ్ముడు వైఎస్సార్‌సీపీ నేత దేవినేని చంద్రశేఖర్ (52) అనారోగ్యకారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మృతుని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విచ్చేశారు. ఈ సమయంలో తమ నాయకుడు ఉమా మంచి వాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.
దీంతో అక్కడ జరుగుతున్న విషయం అర్ధంకాక భువనేశ్వరి కొన్ని నిముషాలు ఖిన్నులయ్యారు. చంద్రశేఖర్ మృతి చెంది రెండు రోజులయినప్పటికీ రాజకీయ రంగు అంటుకోవటం పట్ల కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం, అమావాస్య రోజు పరామర్శించే కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడి మరణాన్ని కూడా ఉమా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం చూస్తుంటే సిగ్గేస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.
మృతిచెందే వరకూ వైఎస్సార్‌సీపీలోనే
దశాబ్దం క్రితం దేవినేని చంద్రశేఖర్ వైఎస్సార్‌సీపీలో చేరి మరణించే వరకు పార్టీలో కొనసాగారు. పది రోజుల క్రితం ఆయన బతికి ఉన్న సమయంలోనూ తన సహచరులతో 2024లో తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్‌తో కలసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేత భౌతిక కాయానికి గురువారం టీడీపీ జెండా కప్పటం పట్ల ఆయన అభిమానులు, సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం చంద్రశేఖర్ తన పిల్లల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి ఉమాను ఆహ్వానిస్తే ఆయన వెళ్లలేదు. పక్షం రోజుల క్రింత చంద్రశేఖర్‌ను టీడీపీ నాయకులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నంతకాలం రానని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటువంటి చంద్రశేఖర్ భౌతికకాయంపై ఉమా మహేశ్వరరావు పచ్చ జెండా కప్పటంపై రాజకీయ ప్రయోజనం కాక మరొకటి లేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని ప్రేమను తెచ్చుకుని రాజకీయ లబ్ది కోసం ఉమా చేస్తున్న ఉబలాటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment