హైదరాబాద్ లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్.. | mobiles r&b hub in telangana | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్..

Published Thu, Mar 10 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

హైదరాబాద్ లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్..

హైదరాబాద్ లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్..

మొబైల్ ఫోన్ల రంగంలో తెలంగాణ మరో మైలు రాయిని అధిగమించనుంది.

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు
సెల్‌కాన్‌తోసహా నాలుగు కంపెనీలు
2,000 మందికి ఉపాధి అవకాశం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో తెలంగాణ మరో మైలు రాయిని అధిగమించనుంది. సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్‌లు సంయుక్తంగా మొబైల్స్ పరిశోధన అభివృద్ధి హబ్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. కంపెనీలు కలసి ఇలా హబ్ నెలకొల్పనుండడం భారత్‌లో ఇదే తొలిసారి. ఇక తెలంగాణలో ఇప్పటికే సెల్‌కాన్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద మొబైల్స్ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తోంది. అలాగే సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్‌లు రంగారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. తాజాగా భాగ్యనగరిలో ఆర్‌అండ్‌డీ హబ్‌కు శ్రీకారం చుట్టాయి.  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఇప్పటికే పలు దఫాలుగా మొబైల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు సాగించారు. చర్చలు విజయవంతం అయ్యాయి కూడా. కంపెనీలకు కావాల్సిన అనుమతులను సత్వరం ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే 2016లోనే హబ్ సాకారం కానుందని సమాచారం.

 2,000 మందికి ఉపాధి..
ఆర్‌అండ్‌డీ హబ్‌కు 5 ఎకరాలు కావాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గచ్చిబౌలి సమీపంలో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇక హబ్‌లో కంపెనీలు వేటికవే తమ సొంత ఆర్‌అండ్‌డీ కేంద్రాలను స్థాపిస్తాయి. ఒక్కో కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టేది త్వరలోనే వెల్లడి కానుంది.  ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల లావా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన ఆర్‌అండ్‌డీ సెంటర్ ఉంది. వచ్చే మూడేళ్లలో పరిశోధన, అభివృద్ధిపై రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె తెలిపారు. ఇక చైనాలోని షెంజెన్‌లో ఉన్న ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను భారత్‌కు తరలించాలని సెల్‌కాన్ భావిస్తోంది. దీనికితోడు డిజైన్ హౌజ్‌ను నెలకొల్పాలన్నది కంపెనీ ఆలోచన. పీసీబీ, చిప్‌సెట్ తదితర విభాగాల తయారీదారులను మొబైళ్ల పరిశోధన, అభివృద్ధిలో భాగస్వాములను చేయడంతోపాటు వారితో కలిసి డిజైన్ హౌజ్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు. మొత్తంగా హబ్ రాకతో 2,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

 ఖర్చూ తగ్గుతుంది..
కంపెనీలకు ఒక్కో మోడల్ అభివృద్ధికి ఎంత కాదన్నా రూ.30 లక్షల దాకా వ్యయం అవుతోంది. సొంత ఆర్‌అండ్‌డీ, డిజైన్ హౌజ్ ఉంటే ఈ ఖర్చులను పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. ఇతర ఖర్చులైన మధ్యవర్తుల ఫీజులు, రవాణా, ప్యాకింగ్ వంటివి ఆదా అవుతాయి. ప్రధానంగా త్వరితగతిన మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు వీలవుతుంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత మొబైల్ ఫోన్ల రంగంలో పోటీలో నిలవాలంటే ఇది తప్పదు. ఇక భారత్ లో సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్‌లు తమ మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. అలాగే ఎగుమతులతో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా బాట పట్టి భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌అండ్‌డీ కేంద్రాల విస్తరణతో కంపెనీలు మరింత వేగంగా వృద్ధిని సాధిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement