
అంతర్జాతీయంగా ఎదగాలి..
బ్యాంకులు నింపాదిగా పనిచేసే విధానాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
క్రియాశీలకంగా వ్యవహరించాలి..
* సైబర్ నేరాలు అరికట్టడంపై దృష్టి పెట్టాలి
* ‘జ్ఞాన సంగం’లో బ్యాంకులకు ప్రధాని సూచన
పుణె: బ్యాంకులు నింపాదిగా పనిచేసే విధానాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సామాన్యులకు సహాయం అందించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, అంతర్జాతీయంగా టాప్ స్థాయికి ఎదగాలని శనివారం పేర్కొన్నారు. బ్యాంకులు వృత్తి నిపుణుల సారథ్యంలో ఎదగాలని, వాటి కార్యకలాపాల్లో రాజకీయ జోక్యానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న సందర్భాల్లో ఇలాంటి జోక్యాన్ని తాను సమర్థిస్తానని ప్రధాని చెప్పారు. శనివారం జ్ఞాన సంగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. దేశ ఎకానమీ వృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ప్రగతే నిదర్శనంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బ్యాంకులు ఏటా ఒక్కో రంగాన్ని ఎంచుకుని, దాని ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని మోదీ తెలిపారు.
అధిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగే సంస్థలకు రుణాల మంజూరీలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసే దిశగా కనీసం 20,000-25,000 మంది ఔత్సాహిక స్వచ్ఛత వ్యాపారవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు తోడ్పాటు అందించాలన్నారు. ఆర్థికాంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని మోదీ సూచించారు.
సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం: జైట్లీ
ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రిస్కులు తీసుకోక తప్పదు కనుక.. ఆ ప్రయత్నాల్లో ఏవైనా తప్పులు దొర్లినా, ప్రభుత్వం బాసటగా నిల్చేందుకు సిద్ధం అన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కావాల్సిన తోడ్పాటు అందించేలా నిబంధనలు సవరించడాన్నీ పరిశీలిస్తామని చెప్పారు.
ఇక, సరైన వేల్యుయేషన్లు వచ్చినప్పుడే పీఎస్‌బీల్లో వాటాల విక్రయం చేపడతామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, విలీనాలకు సంబంధించి ప్రభుత్వం కాకుండా బ్యాంకులే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడి తేబోదని స్పష్టం చేశారు.
ఏడాదిలో మొండి బకాయిలు తగ్గాలి: రాజన్
ఎకానమీని మళ్లీ అధిక వృద్ధి బాట పట్టించాలంటే.. ఏడాది వ్యవధిలోగా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్యను చక్కబెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఎన్‌పీఏలుగా మారే అవకాశాలున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు, వృద్ధికి అవసరమయ్యే వనరులను సమీకరించుకోవడంలో భాగంగా ఇంటింటా ఉండే పొదుపు మొత్తాలను పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని రాజన్ చెప్పారు. బ్యాంకర్లు వాణిజ్యపరమైన నిర్ణయాలు విషయాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చని, అయితే వీటి వెనుక దురుద్దేశం లేనిపక్షంలో.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు.