
డర్డీ డజన్‌కు తోడుగా మరిన్ని కంపెనీలు!!
♦ త్వరలో ఎన్‌సీఎల్‌టీ ముందుకు రెండో లిస్టు
♦ జాబితాలో వీడియోకాన్, జేపీ వెంచర్స్ తదితర సంస్థలు!!
ముంబై: మొండి బాకీలు పేరుకుపోయిన మరిన్ని కంపెనీల కేసులు త్వరలో దివాలా కోర్టు ముందుకు చేరనున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందుకు బ్యాంకులు పంపతగిన కంపెనీల రెండో జాబితాను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి జాబితాలోని డర్టీ డజన్ కంపెనీలపై చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా రాబోయే కొత్త లిస్టులో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (స్థూల రుణభారం రూ. 47,554 కోట్లు), జైప్రకాశ్ పవర్ వెంచర్స్ (రూ. 21,098 కోట్లు), అబాన్ ఆఫ్‌షోర్ (రూ. 12,030 కోట్లు), పుంజ్ లాయిడ్ (రూ. 6,126 కోట్లు), శ్రీ రేణుక షుగర్స్ (రూ. 6,012 కోట్లు), జిందాల్ స్టెయిన్‌లెస్ (రూ. 3,367 కోట్లు) తదితర సంస్థలు ఉండగలవని తెలుస్తోంది.
ఎన్‌సీఎల్‌టీకి నివేదించతగిన మరిన్ని కంపెనీల జాబితాను ఆర్‌బీఐ అంతర్గత సలహా కమిటీ .. బ్యాంకులకు పంపనున్నట్లు సమాచారం. కొత్తగా అమల్లోకి వచ్చిన దివాలా చట్టం ప్రకారం.. మొండి బాకీ ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించేలా బ్యాంకులను ఆదేశించేలా ఆర్‌బీఐకి అధికారాలు లభించిన సంగతి తెలిసిందే.