
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెండో జాబితాలోని 28 భారీ రుణ ఎగవేతదారులకు గాను 24 కేసులను దివాలా చర్యల కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కు నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ 28 ఎన్‌పీఏ కేసులను పరిష్కరించుకోవాలని లేదా డిసెంబర్ 31 నాటికి ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలని ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం మొండి బకాయిల్లో ఈ 28 ఖాతాదారులు ఎగవేసిన మొత్తం రూ.4 లక్షల కోట్లుగా ఉంది.
వీటిలో అన్రక్ అల్యూమినియం, జయస్వాల్ నెకో, సోమా ఎంటర్ ప్రైజెస్, జైప్రకాశ్ అసోసియేట్స్ మినహా మిగిలిన కేసులన్నీ ఎన్‌సీఎల్‌టీ ముందుకు వెళ్లనున్నాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. దివాలా చర్యలు ఎదుర్కోబోయే వాటిలో ఐవీఆర్‌సీఎల్, ఉత్తమ్ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్ ప్రాజెక్టŠస్, నాగార్జున ఆయిల్, రుచి సోయా, ఉత్తమ్ గాల్వా మెటాలిక్ తదితర కేసులు ఉన్నాయి.