
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం భారత టూవీలర్ పరిశ్రమకు కలిసివస్తోంది. 6.5 శాతం సగటు జీడీపీ వృద్ధిరేటును నమోదుచేస్తూ బంగ్లా ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లటానికి ప్రధాన కారణం అక్కడి రెడీమేడ్ దుస్తుల పరిశ్రమే. దుస్తుల ఎగుమతులతో గణనీయ వృద్ధి రేటు నమోదవుతుండటంతో... అక్కడి ప్రజల వినియోగ అలవాట్లూ మారుతున్నాయి. యువతకు బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. ఫలితం... భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టూ–వీలర్స్ జాబితాలో బంగ్లాదే మొదటి స్థానం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2017–18లో బంగ్లాకు ఎగుమతైన ద్విచక్ర వాహనాల విలువ ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది.
బంగ్లాలో భారత కంపెనీల హవా
ప్రస్తుతం బంగ్లా టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో రెండింటిదే హవా. ఈ రెండూ అక్కడ సగం వాటాను సొంతం చేసుకున్నాయి. మార్కెట్ లీడర్‌గా ఎదిగే విషయంలో ప్రస్తుతం బజాజ్ ఆటో కాస్త ముందంజలో ఉండగా, హీరో మోటో కార్ప్ సైతం కాస్త అటూఇటుగా దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలకు గతేడాది ఇండియా నుంచి రూ.13,793 కోట్ల విలువైన మోటార్ సైకిళ్ల ఎగుమతి కాగా దీన్లో బంగ్లాదేశ్ వాటానే 14 శాతం కావటం విశేషం. మరోవంక ఇక్కడి నుంచి శ్రీలంకకు ఎగుమతి అవుతున్న ద్విచక్ర వాహనాలు 3.5% తగ్గుదల నమోదుచేయగా.. నేపాల్ ఎగుమతులు 3.7 శాతం పెరిగాయి.
‘హీరో’కు బంగ్లాలో సొంత ప్లాంట్
బంగ్లా మార్కెట్‌లో వాటా పెంపునకు హీరో మోటోఅక్కడి సంస్థ నిలాయ్ మోటార్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. హెచ్‌ఎమ్‌సీఎల్ నిలాయ్ బంగ్లాదేశ్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌బీఎల్) పేరిట ఏర్పాటైన ఈ సంస్థలో హీరోకు 55 శాతం వాటా ఉంది. ఏడాదికి 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ జేవీ గతేడాది జూన్ నుంచి కార్యకలాపాలను మొదలెట్టింది.
ట్రక్కుల ఎగుమతిలోనూ..
గతేడాదిలో భారత్ నుంచి బంగ్లాకు ఎగుమతి అయిన ట్రక్కుల విలువ రూ.1,598 కోట్లుగా నమోదయింది. భారత్ నుంచి ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి జరుగుతున్న దేశాల జాబితాలో టాప్ 20లో బంగ్లా కూడా ఉంది.
అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు...
ద్విచక్ర వాహనాల కంపెనీలతో పాటు బంగ్లాదేశ్‌లో అనేక ప్యాసింజర్ వాహన సంస్థలకూ స్థానికంగా అసెంబ్లింగ్ యూనిట్లున్నాయి. టాటా మోటార్స్ అక్కడి సంస్థ నిటోల్ మోటార్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేసింది. ఈ జేవీ కంపెనీ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలనూ విక్రయిస్తోంది. మరో దేశీ దిగ్గజం అశోక్ లేలాండ్ సైతం అక్కడి సంస్థతో కలిసి జేవీని ఏర్పాటుచేసి, అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పింది.
భారత్ అవసరం చాలానే ఉంది..!
‘వాహన మార్కెట్ బంగ్లాదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రాంతీయంగా అక్కడి ఆటోమొబైల్ ఉత్పత్తి రంగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ దేశానికి భారత్ అవసరం అధికంగానే ఉంది. అవసరం రీత్యా అనేక భారత కంపెనీలతో బంగ్లా సంస్థలు జట్టుకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం కోసం గతేడాది ఫిబ్రవరిలో ఢాకాలో ఇండో–బంగ్లా ఆటోమోటివ్ షోను సియామ్ నిర్వహించింది. మరోమారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ షోను నిర్వహించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment