
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు నానాటికీ తగ్గిపోతుండగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) పెట్టుబడులు మాత్రం జోరుగా పెరుగుతున్నాయి. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 800 కోట్ల డాలర్లుగా ఉన్నాయని మార్నింగ్‌స్టార్ ఇండియా సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుత ఏడాది ఇదే కాలానికి వీరి పెట్టుబడులు కేవలం 1.5 కోట్ల డాలర్లుగా మాత్రమే ఉన్నాయని పేర్కొంది.
గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 330 కోట్ల డాలర్లు మాత్రమేనని, ఈ ఏడాది ఇదే కాలానికి వీరి పెట్టుబడులు 790 కోట్ల డాలర్లకు పెరిగాయని, అంటే దాదాపు రెట్టింపునకు పైగా పెరిగాయని పేర్కొంది. విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులపై మార్నింగ్‌స్టార్ ఇండియా సంస్థ రూపొందించిన తాజా నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...
నివేదికలోని అంశాలు
♦ విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది జనవరిలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో మాత్రం 180 కోట్ల డాలర్లను వెనక్కి తీసుకున్నారు. మార్చిలో మళ్లీ 180 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. మార్చి, ఏప్రిల్‌లో 230 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
♦విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగిస్తుండగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరు మాత్రం కొనసాగుతోంది.
♦ విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక్కటే మార్కెట్. భారత్‌లో కంటే ఇతర దేశాల స్టాక్ మార్కెట్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులను వెనక్కి తీసుకొని, వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వెసులుబాటు దేశీయ ఇన్వెస్టర్లకు ఉండదు. వాళ్లకు మన మార్కెట్ ఒక్కటే ఉంటుంది.
♦ ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ బాగా జరిగింది. ఈ కేటగిరీలో జనవరిలో మాత్రం 120 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు నెలల్లో 200 కోట్ల నికర పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. గత నాలుగు నెలల్లో ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 96.6 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అలాగే ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 94 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
♦ దీర్ఘకాలిక స్వభావం ఉన్న ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి భారీగా పెట్టుబడులు తరలిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.
Comments
Please login to add a commentAdd a comment