న్యూయార్క్ : అమెరికా అత్యంత అసహ్యించుకునే వ్యక్తి 'ఫార్మా బ్రో' మార్టిన్ షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్ష పడింది. పెట్టుబడిదారులను మోసగించినందుకు గాను న్యూయార్క్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు జడ్జ్ శుక్రవారం అతనికి ఈ శిక్ష విధించారు. షక్రెలీ నకిలీ అకౌంట్ స్టేట్‌మెంట్లను పంపి పెట్టుబడిదారులను మోసగించాడు. అంతేకాక తను నడుపుతున్న హెడ్జ్ ఫండ్స్ నష్టాలను కూడా పెట్టుబడిదారుల వద్ద దాచిపెట్టాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాడు. దీంతో షక్రెలీకి ఫెడరల్ జడ్జి ఈ శిక్ష విధించింది.
ఒక జీవితాన్ని నిలబెట్టే హెచ్‌ఐవీ మెడికేషన్ డరాప్రిమ్ రేటును రాత్రికి రాత్రి 13 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచడంతో, షక్రెలీ తొలిసారి 2015లో వెలుగులోకి వచ్చాడు. అంటే ఆ మెడిషిన్ ధరను దాదాపు 5000 శాతం పెంచేశాడు. ఆ సమయంలో ఫార్మా బ్రోగా పేరున్న టూరింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను షక్రెలీ నిర్వహించేవాడు. ఎయిడ్స్ చికిత్స కోసం వాడే ఈ మెడిషిన్ రేట్లను ఒక్కసారిగా పెంచడంతో, అమెరికాలో అతన్ని అసహ్యహించుకోని వారంటూ లేరు. దీంతో మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఇన్ అమెరికాగా పేరులోకి వచ్చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో సెక్యురిటీస్ ఫ్రాడ్ కూడా వెలుగులోకి వచ్చింది.
అతను నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంబీ క్యాపిటల్, ఎంఎస్‌ఎంబీ హెల్త్‌కేర్ అనే హెడ్జ్ ఫండ్స్ ద్వారా మిలియన్ కొద్దీ డాలర్లను పెట్టుబడిదారుల నుంచి నొక్కేసినట్టు తేలింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వాటిలో అతను దోషిగా కూడా నిర్ధారణ అయింది. అనంతరం షక్రెలీ పెట్టుకున్న బెయిల్‌ను కూడా జడ్జి రద్దు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా షక్రెలీ లాయర్లు 12 నుంచి 18 నెలల శిక్షను కోరాగా.. ప్రాసిక్యూటర్లు మాత్రం ఇతనికి 15 ఏళ్లు జైలు శిక్ష విధించాల్సిందేనని పట్టుబట్టారు. వీరి వాదనలు విన్న తర్వాత షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్షను జడ్జి ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment