సాక్షి,ముంబై : లక్షల రూపాయలు మోసపోయామంటూ పండుగ వేళ పెట్టుబడిదారులు రోడ్డెక్కారు. ముంబైలోని గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు రూ. కోట్ల మేర ఇన్వెస్టర్లను ముంచేసి బిచాణా ఎత్తేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని అనంతరం భారీగా టోకరా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన 50కి పైగా పెట్టుబడిదారులు ముంబైలోని రాంనగర్ పోలీస్ స్టేషన్ ముందు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గుడ్‌విన్ జ్యువెల్లరీ షాపులను సీజ్ చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆకర్షణీయ పథకాలు, బంగారం, 16 శాతం వడ్డీ, ఇతర ఆఫర్లతో గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. దీంతో వేలమంది రూ.2 వేల దాకా 50 లక్షల దాకా పెట్టుబడులు పెట్టారు. అయితే అక్టోబర్ 21నుంచే యజమానులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. షాపులను మూసివేసి కుటుంబ సభ్యులతో సహా ఉడాయించారనీ, నిందితుల పాస్‌పోర్ట్ వివరాలను సేకరిస్తున్నామనీ, లుక్ అవుట్ నోటీసులు జారీకి యోచిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసులను, పోలీసు కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేశామన్నారు. గుడ్‌విన్ గ్రూప్ ఛైర్మన్ ఎం సునీల్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఎం.సుధీర్ కుమార్; గుడ్‌విన్ జ్యువెలర్స్ డొంబివ్లి బ్రాంచ్ మేనేజర్ మనీష్ కుండిపై కేసునమోదుచేశామనీ, నిందితులు పరారీలో ఉన్నారని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ అహెర్ తెలిపారు.
ఒక్క డొంబివ్లి శాఖలోనే వెయ్యిమంది దాకా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరు 13 లక్షల నుండి కోటి రూపాయల మధ్య పెట్టుబడి వుంటారని అనుమానం. ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయనీ, దీంతో ఈ కేసు ఫిర్యాదులను స్వీకరించడానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (క్రైమ్) ఎన్ వి జాదవ్ అన్నారు.
గుడ్‌విల్ జ్యువెల్లరీ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ దాదాపు 29మంది పెట్టుబడిదారులు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 80 కోట్ల రూపాయల మోసపోయామని ఆరోపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదివారం మరింతమంది బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. మరో 300 బాధితులు నమోదు చేసే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుడ్‌విన్ ప్రకటించిన ఆఫర్లకు ఆకర్షితుడనై చాలా ఆశతో భారీ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టామని బాధితులు వాపోతున్నారు. రూ. 9.81 లక్షలు పెట్టుబడి పెట్టానని సంజయ్ బిస్వాస్ (44) తెలిపారు.
కాగా కేరళకు చెందిన గుడ్‌విన్ జ్యుయలరీ గ్రూప్‌నకు థానే, నవీముంబై సహా ముంబైలో 13 బ్రాంచీలున్నాయి. వీటిలో చాలావరకు ఇప్పుడు మూసివేయడం గమనార్హం. బాధిత పెట్టుబడిదారుల్లో కేరళనుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన వారే ఎక్కువని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment