ఏడాదికి 120 శాతం వడ్డీ పేరుతో డిపాజిట్ల సేకరణ
భారత్‌తోపాటు ఆ్రస్టేలియాలోనూ వసూళ్లు
ఇన్వెస్టర్లకు కుచ్చుటోపీ పెట్టిన డీబీ స్టాక్ బ్రోకింగ్
హైదరాబాద్‌లోనూ ఈ సంస్థకు కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకటి రెండు కాదు ఏకంగా రూ.7 వేల కోట్ల స్కాం జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపించి పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది అస్సాంలోని గువాహటికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోనూ కార్యాలయం ఉంది.
నగరానికి చెందిన వందలాది మంది ఇన్వెస్టర్లు డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించకుండా బిచాణా ఎత్తివేయడంతో లబోదిబోమంటూ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
23 వేల మంది పెట్టుబడులు
అస్సాంకు చెందిన దీపాంకర్ బర్మన్ 2018లో డీబీ స్టాక్ బ్రోకింగ్‌ను ప్రారంభించారు. ఈ సంస్థకు గువాహటితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోనూ కార్యాలయాలున్నాయి. పెట్టుబడులపై ఏడాదికి 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం, మూడు నెలలకు 27 శాతం, నెలకు 8 శాతం చొప్పున వడ్డీ ఇస్తామని ప్రకటించారు. దీంతో స్థానికులతోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంతకాలం పాటు వడ్డీ చెల్లించిన ఈ సంస్థ.. ఈ ఏడాది జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి మన దేశంతో పాటు ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్ల నుంచి కూడా డిపాజిట్లు సేకరించారు. సుమారు 23 వేల మంది పెట్టుబడులు పెట్టారు.
గత నెలలో పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పంచాక్షర్ రూ. 11 లక్షలు, గంటాడి హరి రూ. 88.50 లక్షలు, విశ్వజీత్ సింగ్ రూ. 36.80 లక్షలు, పి.రాజు మహేంద్ర కుమార్ రూ. 26 లక్షలు, వందపాటి లక్ష్మి రూ. 64.50 లక్షలు.. ఇలా డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని పలువురు బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీపాంకర్ బర్మన్, అతని సహచరులపై చీటింగ్‌తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆగస్టు 21న బర్మన్ అస్సాంలోని ఆఫీసు బోర్డు తిప్పేసి గువాహటి నుంచి పరారయ్యారు. దీంతో పాన్ బజార్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. బర్మన్ ఆ్రస్టేలియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment