లిక్విడిటీకి ఆర్‌బీఐ చెక్!
ప్రారంభమైన ఎంపీసీ భేటీ; నేడు విధాన ప్రకటన
⇒ డీమోనిటైజేషన్‌తో బ్యాంకులవద్ద దండిగా నిధులు; రుణాలకు తగ్గిన డిమాండ్
⇒ రూ.4 లక్షల కోట్లు అదనపు లిక్విడిటీ ఉందన్న హెచ్‌ఎస్‌బీసీ
⇒ సర్దుబాటు చర్యలు ప్రకటించొచ్చన్న అభిప్రాయం
⇒ మొండి బకాయిలపైనా దృష్టి; రేట్ల కోత కష్టమేనని అంచనా...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం గురువారంతో ముగుస్తుంది. ఎంపీసీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఆరో ద్వైమాసిక సమీక్ష ఇది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి వెలువడే చర్యలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్కెట్లో, బ్యాంకింగ్ వ్యవస్థలో అధికంగా ఉన్న నగదు లభ్యతను తగ్గించడం, రుణాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో పుంజుకునేందుకు చర్యలు, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల(ఎన్‌పీఏ) సమస్యకు పరిష్కారాలపై తాజా సమీక్షా సమావేశంలో ఎంపీసీ దృష్టి పెట్టనుందని తెలుస్తోంది.
ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక రేట్లను ఎంపీసీ యథాతథంగా కొనసాగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూ ఉండటం ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ పాలసీ రేటు ఈ స్థాయికి మించి తగ్గదన్న సంకేతాన్నిస్తోందని... దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను బట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగేందుకూ అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరిగా ఫిబ్రవరిలో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయని విషయం తెలిసిందే. రెపో రేటును 6.25 శాతంగానే కొనసాగిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణి నుంచి తటస్థ విధానానికి మళ్లుతున్నట్టూ ప్రకటించింది.
ద్రవ్య లభ్యత తగ్గించే చర్యలు
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత భేటీలో ప్రధానంగా అధికంగా ఉన్న ద్రవ్య లభ్యతకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో డీమోనిటైజేషన్ నిర్ణయం తర్వాత వెనక్కి తీసుకున్న నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం రూ.14 లక్షల కోట్ల వరకు తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. ఈ క్రమంలో వ్యవస్థలో అదనంగా ఉన్న ద్రవ్య లభ్యతను సర్దుబాటు చేసేందుకు వీలుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) వంటి చర్యలను ఆర్‌బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా బ్యాంకుల వద్ద వున్న అధిక నిధుల్ని ఆర్‌బీఐ డిపాజిట్ చేసుకుంటుంది. ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మార్కెట్‌లో రూ.4 లక్షల కోట్ల అదనంగా నగదు లభ్యత ఉందని, దాన్ని సర్దుబాటు చేసే నిర్ణయాలను సెంట్రల్ బ్యాంకు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ద్రవ్యపరపతి విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన గల ఓ ప్యానెల్ గతంలో ఎస్‌డీఎఫ్‌ను ప్రతిపాదించింది.
భిన్నమైన పరిస్థితి..
ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ఎంపీసీ సమావేశం వివరాలను పరిశీలిస్తే... బ్యాంకింగ్ రంగంలో రుణాలకు డిమాండ్ క్షీణించడం, పలు రంగాల్లో పెట్టుబడుల్లోనూ ఇదే ధోరణి ఉండటంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి భారీగా నగదు డిపాజిట్లు వెల్లువలా వచ్చిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ కార్యక్రమం ముసిగి 3 నెలలు గడిచినా లిక్విడిటీ వ్యవహారం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. రుణాలకు డిమాండ్ పెద్దగా లేకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరంగా తయారైంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తంలో తీసుకోనివి ఇంకా రూ.2 లక్షల కోట్ల మేర ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ అంచనా. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి లిక్విడిటీ సర్దుబాటు దిశగా కచ్చితంగా చర్యలు ఉంటాయని అంచనా.