చిన్న సంస్థలతో మేక్ ఇన్ ఇండియా సాకారం
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పడగలవని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో ఇన్‌క్యుబేషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.
పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేయగలమని శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిశ్రా వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా 20 శాతం కొనుగోళ్లను ఎంఎస్‌ఎంఈల నుంచే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగ సంస్థలు ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేందుకు నాణ్యతాపరమైన అప్‌గ్రేడేషన్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు మిశ్రా తెలిపారు.