Make in India program
-
'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ ప్రారంభించామన్నారు. అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు. ఈ కేంద్రంలోని కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్వర్కింగ్, కనెక్టివిటీ ఫ్యూచర్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన) వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్సెట్ తయారీదారు గురువారం అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
ఆసుస్‌తో ఫ్లిప్‌కార్ట్ : కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, తైవనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఆసుస్ అధికారిక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా లేటెస్ట్, గ్రేటెస్ట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ఆసుస్ నిర్ణయించింది. 2020 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 25 శాతం తానే పొందాలని ఫ్లిప్‌కార్ట్ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ బ్రాండ్‌ను పెంచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఓ టెక్ దిగ్గజంతో తాము ఎక్స్‌క్లూజివ్ పార్టనర్షిప్ ఏర్పరుచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ఈ వారం మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన సందర్భంగానే భారత్‌లో 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను యాడ్ చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్టు ఆసుస్ సీఈవో జెర్రీ షేన్ తెలిపారు. ఏప్రిల్ 23న ఆసుస్ జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతోన్నట్టు తెలిపారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ డివైజ్‌ను ఆసుస్ గతేడాది ఆగస్టులోనే రివీల్ చేసింది. కొన్ని కొన్ని మార్కెట్లలోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఆసుస్ ప్రకటించనప్పటికీ, రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఈ ఫోన్ ధర ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు 5.5 అంగుళాల ఎల్సీడీ ఐపీఎస్ డిస్ప్లే, 2.5డీ గ్లాస్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్టు సమాచారం. -
మేకిన్ ఇండియాలో కదలిక
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియాలో పెట్టుబడులు ఊపందుకోనున్నాయి. దక్షిణాఫ్రికా వాణిజ్య దిగ్గజం లొట్టె గ్రూప్, ఫ్రెంచ్ ఆటోమొబైల్ గ్రూప్ పీజెట్ ఎస్ఏ భారీ పెట్టుబడులతో భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇరు సంస్థలు కలిసి దాదాపు 40,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలపై కసరత్తు సాగుతోంది.రానున్న ఐదేళ్లలో లొట్టె రూ 20 వేల కోట్ల నుంచి 30వేల కోట్ల వరకూ వెచ్చించాలని సన్నాహాలు చేస్తోంది. రిటైల్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికాకు చెందిన లొట్టె గ్రూపు యోచిస్తోంది. దేశంలో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లను డెవలప్ చేసి వాటిని నిర్వహించడంపైనా ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. పీజెట్, సిట్రోన్ కార్ల తయారీ సంస్థ పీఎస్ఏ గ్రూప్ దక్షిణాదిలో రూ 7వేల కోట్లతో కారు ఫ్యాక్టరీ, ఇంజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరుపుతోంది. భూమి కేటాయింపులు, రాయితీలు, సత్వర అనుమతులతో విదేశీ కంపెనీలను భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ చర్యలు వరల్డ్ బ్యాంక్ వ్యాపార సరళతర సర్వేలో భారత్ మెరుగైన ర్యాంక్ సాధించేందుకు, ఇటీవల మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ అయ్యేందుకు దోహదపడ్డాయని అధికారులు చెబుతున్నారు. భారత్ సహా పలు దేశాల్లో వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు వాణిజ్య అవకాశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనిపై తుది నిర్ణయం వెలువడలేదని లొట్టె ఓ ప్రకటనలో పేర్కొంది. -
నంబర్ వన్ కావడమే లక్ష్యం
సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెనిచిరో హిబి సాన్ సాక్షి,విశాఖపట్నం: మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెనిచిరో హిబి సాన్ తెలిపారు. విశాఖలోని డైమండ్ పార్క్, గాజువాఖ ప్రాంతాల్లో గల సోనీ సెంటర్లను సోమవారం రాత్రి ఆయన సందర్శించారు. సోనీ ఏపీ మేనేజర్ అభిజిత్, సోనీ విశాఖ సెంటర్ యజమాని జగదీష్‌లు కెనిచిరోకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆరు శాతం, టెలివిజన్ మార్కెట్లో 30 శాతం వాటా సోనీకి ఉందన్నారు. ఈ ఏడాది నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది ఐసీసీ వరల్డ్‌కప్ వంటి పెద్ద ఈవెంట్స్ ఉండటంవల్ల అమ్మకాలు బాగున్నాయన్నారు. ఈ ఏడాది దసరా, దీపావళి వంటి పండుగలపైనే వ్యాపారం ఆధారపడిందన్నారు. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. దానిలో భాగంగానే గత ఆగస్టులో తొలిసారిగా సోనీ బ్రేవియా ఆండ్రాయిడ్ టీవీలు ప్రవేశపెట్టామన్నారు. -
టాప్ త్రీలో మన వాహన రంగం!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, వాహన పరిశ్రమలు సంయుక్తంగా 2016-26 కాలానికి ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను (ఏఎంపీ) ఆవిష్కరించాయి. ఇక్కడ జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్(సియామ్) సాధారణ సమావేశంలో ఈ ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను విడుదల చేశారు. మంచి లక్ష్యాలతో ఈ ఏఎంపీని రూపొందించారని సియాం మాజీ అధ్యక్షుడు, మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లకాలంలో ప్రపంచంలోనే 3 అతి పెద్ద వాహన మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను నిలపాలని ఈ ఏఎంపీ లక్ష్యించింది. ఏఎంపీకి సంబంధించిన ముఖ్యాంశాలివీ... ►{పస్తుతం రూ.4..64 లక్షల కోట్లుగా ఉన్న వాహన రంగ ఉత్పత్తి విలువను పదేళ్లలో రూ.18.89 లక్షల కోట్లకు పెంచాలి. ►మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో కీలక చోదక శక్తిగా వాహన రంగం నిలవాలి. ►పదేళ్లలో జీడీపీకి అదనంగా 12 శాతం విలువను జోడించే సత్తా వాహన రంగానికుంది. 2026 కల్లా తయారీ రంగం వాటా 40 శాతానికి చేరాలి. ►2006-16 కాలానికి వాహన రంగం 2.5 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. 2016-26 కాలానికి అదనంగా 6.5 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించనుంది. కోలుకుంటోంది... అయితే! వాహన రంగంపై భారీగా ఉన్న పన్నులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన సియామ్... జీఎస్టీపై రాజకీయ ఐక్యత కొరవడడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసింది. సుదీర్ఘకాల మందగమనం నుంచి వాహన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సియామ్ ప్రెసిడెంట్ కిర్లోస్కర్ చెప్పా రు. పన్ను భారాలు తగ్గితే మరింత లాభమన్నారు. -
రైల్వే తొలి ఎఫ్‌డీఐ బిడ్లకు 3 దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేలో తొలి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఆఫర్‌కు మూడు అంతర్జాతీయ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. బీహార్‌లోని మాధేపురాలో ఆధునిక ఎలక్ట్రిక్ రైలు పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీని రూ.1.300 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సీమెన్స్, ఆల్స్టోమ్, బొంబార్డీయిర్.. ఈ మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ తమ బిడ్లను దాఖలు చేశాయి. ఏడాదికి ఇక్కడ 80కు పైగా రైలుపెట్టెలు తయారవుతాయి. ఈ మూడు అంతర్జాతీయ కంపెనీలు వేసిన బిడ్లను టెండరింగ్ కమిటీ మదింపు చేసి సెప్టెంబర్ చివరికల్లా ఫలితం ప్రకటిస్తారు. -
శ్రీసిటీలో షావొమీ ఫోన్ల తయారీ
ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం - రెడ్మీ2 ప్రైమ్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు - మొబైల్ ధర రూ. 6,999 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో జట్టు కట్టింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో రూపొందించిన రెడ్మీ2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో దీన్ని ఆవిష్కరించారు. ఈ ఫోన్ ధర రూ. 6,999. వస్తు తయారీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘మేకిన్ ఇండియా - ‘మేడిన్ ఏపీ’అనే విధానంతో పారిశ్రామిక సంస్థలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వస్తు తయారీ పరిశ్రమకు అవసరమైన అనుమతులన్నీ ఆన్లైన్ విధానంలో రెండువారాల్లోనే మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, చైనా కాకుండా బ్రెజిల్లో కూడా తమకు ప్లాంటు ఉందని, భారత్లోనిది రెండోదని షావొమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా తెలిపారు. ఇక్కడి ప్లాంటు నుంచి త్వరలో మరిన్ని డివైజ్‌లను కూడా ప్రవేశపెట్టగలమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ కాంత్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్లైన్లో లభ్యం.. రెడ్మీ2 ప్రైమ్‌లో 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, మిడాట్‌కామ్ ఆన్లైన్ సైట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచీ రెడ్మీ 1ఎస్, రెడ్మీ2 మొదలైన స్మార్ట్ఫోన్లు ముప్పై లక్షలపైచిలుకు విక్రయించినట్లు ఆయన వివరించారు. ఇక ఇప్పుడు భారత్‌లోనే తయారీ కూడా మొదలుపెట్టడం వల్ల డెలివరీ సమయం 3-4 వారాల నుంచి 2 వారాలకు తగ్గగలదని షావొమీ భారత విభాగం హెడ్ మనూ జైన్ చెప్పారు. బ్రెజిల్ తరహాలోనే భారత మార్కెట్ అవసరాలకు మాత్రమే ఇక్కడి ఉత్పత్తిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ ప్రస్తుతం యాపిల్ ఫోన్లను కూడా తయారు చేస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్, మైక్రోమ్యాక్స్, స్పైస్ తదితర మొబైల్ సంస్థలు ఇప్పటికే భారత్‌లో తమ ఫోన్లను అసెంబుల్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా షావొమీ కూడా ఆ జాబితాలో చేరినట్లయింది. -
‘మేక్ ఇన్ ఇండియా’ కేవలం నినాదమే!
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఒక నినాదం మాత్రమేనని సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తయారీలోని డిమాండ్లు, విలోమ పన్ను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, అధిక ధరలను తగ్గించడం లాంటి సవాళ్లను మోదీ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయిందని అన్నారు. గతేడాదితో పోలిస్తే 2015లో ఎగుమతులు 11 శాతం తగ్గాయని, గతేడాది 26.89 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్న ఎగుమతులు 2015 జనవరిలో 23.88 డాలర్లకు పరిమితమయ్యాయని అన్నారు. జీఎస్టీ బిల్లులో అంతర రాష్ట్ర పన్నును 1 శాతం పెంచడాని బట్టి చూస్తే ఆర్థిక సమస్యలపై వారికి అవగాహన లేదని తెలుస్తోందన్నారు. ఇది జీఎస్టీ స్పూర్తికి విరుద్ధమని, మేక్ ఇన్ ఇండియాకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఏడాదికాలంలో పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ ధరలు 15 నుంచి 28 శాతం వరకు పెరిగాయన్నారు. ఆర్థికవృద్ధి, దిశలపై మోదీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదన్నారు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, ఎరువులు, కరెంటు, స్టీల్ పరిశ్రమల్లో వృద్ధి 2014-2015లో 3.5 శాతం పడిపోయిందని అన్నారు. ఏడాది పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న ప్రభుత్వం 17.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. -
పరిశ్రమే ప్రధానం
మేక్ ఇన్ ఇండియాకు ఊతం న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. తద్వారా దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, మరిన్ని ఉద్యోగాల కల్పనకు తోడ్పాటునందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్పొరేట్ పన్నును ఇతర దేశాలతో పోటీపడేలా 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించడంతో పాటు కొన్నింటిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించారు. మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి, దేశీ తయారీ పరిశ్రమకు ఊపుతెచ్చారు. మొబైళ్లు, ట్యాబెట్లను దిగుమతి చేసుకునే బదులు ఇక్కడ ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించేలా సుంకాల్ని సవరించారు. ఇన్సులేటెడ్ వైర్లు..కేబుల్స్, ఫ్రిజ్‌లలో కంప్రెసర్ భాగాలు, ఎరువుల తయారీలో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ మొదలైన వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు. ఇక లేథ్ మెషీన్లలో ఉపయోగించే కొన్ని ముడి వస్తువులపై కస్టమ్స్ సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి, మెడికల్ వీడియో ఎండోస్కోప్లపై 5% నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి. అలాగే, స్మార్ట్ కార్డులకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగించే వేఫర్లు మొదలైన వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి. పేస్మేకర్ల తయారీలో ఉపయోగపడే నిర్దిష్ట ముడి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేశారు. ఇనుము, ఉక్కు, రాగి, అల్యూమినియం మొదలైన మెటల్ స్క్రాప్‌పై ప్రత్యేక అదనపు సుంకాన్ని (ఎస్ఏడీ) 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇక, ఎల్ఈడీ లైట్లు తయారీలో ఉపయోగపడే ముడివస్తువులపై నాలుగు శాతంగా ఉన్న ఎస్ఏడీని పూర్తిగా తొలగించారు. సాంకేతిక అంశాలపరంగా చిన్న తరహా సంస్థలు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరించడంపై జైట్లీ దృష్టి పెట్టారు. టెక్నికల్ సర్వీసులకు సంబంధించిన రాయల్టీపై పన్ను రేటును 25 శాతం నుంచి 10 శాతానికి కుదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 దాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నోటిఫైడ్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు అదనంగా 15 శాతం మేర పెట్టుబడిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మరో 15 శాతం మేర తరుగుద ల చూపించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ విషయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్లాంటు, యంత్రాలపై అదనంగా మరో 20 శాతం మేర తరుగుదల చూపించుకునే వీలు కల్పించారు. వీటన్నింటికంటే మించి దేశీయ మౌలిక రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా దేశీయ ఉత్పాదక రంగానికి ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. కాగా.. దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దిగుమతి చేసుకున్న వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని పది శాతం నుంచి 40 శాతానికి పెంచారు. యువ జనాభా ప్రపంచంలోనే ఎక్కువ మంది యువ జనాభా ఉన్న దేశం మనది. పనిచేసేవారు ఎక్కువగా ఉండడం అభివృద్ధిలో దూసుకుపోయేందుకు తోడ్పడుతుంది. పప్పు ధాన్యాలు, జనపనార, పాలు, అరటిపండ్లు, మామిడి ఉత్పత్తిలో భారతే నంబర్ వన్. అలాగే పేదలు, ఎయిడ్స్ బాధితుల సంఖ్య, ఆయుధాల దిగుమతి వంటి అంశాల్లోనూ మనమే టాప్. -
పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?
బడ్జెట్లో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్లో 2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఎగుమతుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా (2013 డిసెంబర్‌తో పోల్చితే) 1.2 శాతం క్షీణించి (మైనస్) 2.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నవంబర్‌లో 152 టన్నుల పసిడి దిగుమతులు డిసెంబర్లో 39 టన్నులకు పడిపోయాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని 2- 4 శాతం శ్రేణిలో తగ్గించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో క్యాడ్ 4 శాతానికి పైగా పెరిగి, డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 68 వరకూ బలహీనపడిన పరిస్థితుల్లో పసిడి దిగుమతులపై కేంద్రం 10 శాతానికి సుంకాలను పెంచింది. ఆభరణాల విషయంలో ఈ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దీనితో అంతర్జాతీయంగా పసిడి ధర దిగివచ్చినా, ఆ ప్రభావం దేశంలో కనబడలేదు. ఒక దశలో 10 గ్రాములకు ప్రీమియం (దేశీయ-అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం) రూ.3 వేలకు పైగా కనబడింది. దీనితో దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరుగుతూ వస్తోంది. -
చిన్న సంస్థలతో మేక్ ఇన్ ఇండియా సాకారం
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తోడ్పడగలవని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో ఇన్క్యుబేషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేయగలమని శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిశ్రా వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా 20 శాతం కొనుగోళ్లను ఎంఎస్ఎంఈల నుంచే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేందుకు నాణ్యతాపరమైన అప్‌గ్రేడేషన్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు మిశ్రా తెలిపారు.