టాప్ త్రీలో మన వాహన రంగం!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, వాహన పరిశ్రమలు సంయుక్తంగా 2016-26 కాలానికి ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను (ఏఎంపీ) ఆవిష్కరించాయి. ఇక్కడ జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్(సియామ్) సాధారణ సమావేశంలో ఈ ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను విడుదల చేశారు. మంచి లక్ష్యాలతో ఈ ఏఎంపీని రూపొందించారని సియాం మాజీ అధ్యక్షుడు, మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లకాలంలో ప్రపంచంలోనే 3 అతి పెద్ద వాహన మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను నిలపాలని ఈ ఏఎంపీ లక్ష్యించింది. ఏఎంపీకి సంబంధించిన ముఖ్యాంశాలివీ...
►{పస్తుతం రూ.4..64 లక్షల కోట్లుగా ఉన్న వాహన రంగ ఉత్పత్తి విలువను పదేళ్లలో రూ.18.89 లక్షల కోట్లకు పెంచాలి.
►మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో కీలక చోదక శక్తిగా వాహన రంగం నిలవాలి.
►పదేళ్లలో జీడీపీకి అదనంగా 12 శాతం విలువను జోడించే సత్తా వాహన రంగానికుంది. 2026 కల్లా తయారీ రంగం వాటా 40 శాతానికి చేరాలి.
►2006-16 కాలానికి వాహన రంగం 2.5 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. 2016-26 కాలానికి అదనంగా 6.5 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించనుంది.
కోలుకుంటోంది... అయితే!
వాహన రంగంపై భారీగా ఉన్న పన్నులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన సియామ్... జీఎస్‌టీపై రాజకీయ ఐక్యత కొరవడడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసింది. సుదీర్ఘకాల మందగమనం నుంచి వాహన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సియామ్ ప్రెసిడెంట్ కిర్లోస్కర్ చెప్పా రు. పన్ను భారాలు తగ్గితే మరింత లాభమన్నారు.