ముంబై : దేశ ఆర్థిక రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన కమలా హిల్స్ కాంపౌండ్‌లోని భారీ అగ్నిప్రమాదం, ముంబైలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ప్రభావం చూపింది. కమలాహిల్స్‌లోని అగ్నిప్రమాదంతో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మెగా కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్లను, పబ్‌లను కూల్చివేయడం చేపట్టింది. దీంతో ముంబై వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హాటల్స్‌పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో న్యూఇయర్‌లో హోటల్ బుకింగ్స్ 40 శాతం నుంచి 50 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారవేత్తలు చెప్పారు. రిజర్వు చేసుకున్న బుకింగ్స్‌ను కూడా ప్రజలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు.
''గతేడాది కంటే ఈ ఏడాది చాలా రెస్టారెంట్లలో వ్యాపారం 40 శాతం క్షీణించింది. ముంబైలోని ఉత్తతమైన రెస్టారెంట్ హబ్‌గా కమలా హిల్స్ ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ కూల్చివేత కార్యక్రమంతో అక్కడ నీళ్లు కానీ, విద్యుత్ కానీ లభ్యమవడం లేదు'' నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు రియాజ్ ఆమ్లాని అన్నారు. పలు రెస్టారెంట్లకు నీటి, విద్యుత్ సరఫరాను కోత పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో ప్రజలు తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. గురువారం అర్థరాత్రి నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో చెలరేగిన మంటలతో, 15 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment