ప్రపంచ మార్కెట్లు వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. 2020లో యూఎస్ జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలతో అమెరికా, ఆసియా మార్కెట్లు క్షీణించాయి. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ప్రభావంతో ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్ ఫైనాన్స్, మహానగర్ గ్యాస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. నష్టాల మార్కెట్లనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ముత్తూట్ ఫైనాన్స్
కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా దీనికి జత కలసినట్లు చెబుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. మరోవైపు పసిడి ధరలు బలపడుతుండటం కూడా కంపెనీని సానుకూల అంశంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 990 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 998వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇంతక్రితం ఈ ఫిబ్రవరి 25న రూ. 954 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ఇక మార్చి కనిష్టం రూ. 477 నుంచి చూస్తే 105 శాతంపైగా ఎగసింది.
మహానగర్ గ్యాస్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో యుటిలిటీ కంపెనీ మహానగర్ గ్యాస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 167 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు 5 శాతం నీరసించి రూ. 687 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం మాత్రం 10 శాతం పుంజుకుని రూ. 225 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహానగర్ గ్యాస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 1042 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1044 వరకూ ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment