ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అబుదాబిలో కలిశారు. దుబాయ్‌లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు.
భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్‌ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది.
రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్‌లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్‌ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్‌సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్‌ఏఎల్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment