
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ కేంద్రంగా దంత ఉత్పత్తులను విక్రయించే స్టార్టప్ మై డెంటిస్ట్ చాయిస్ ఉత్తర అమెరికాలో అడుగుపెట్టింది. ఇటీవలే రెండో రౌండ్‌లో రూ.3.5 కోట్లు సమీకరించిన ఈ సంస్థ నిధుల సహకారంతో విస్తరణ చేపట్టినట్టు కంపెనీ సీఈవో, కో–ఫౌండర్ శివ ప్రసాద్ పిన్నాపురాలా గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు.
ప్రస్తుతం మై డెంటిస్ట్ చాయిస్‌లో 100 రకాల బ్రాండ్లు, సుమారు 10 వేల రకాల దంత సంబంధిత ఉత్పత్తులున్నాయని తెలిపారు. త్వరలోనే సొంత బ్రాండ్‌తో పలు ఉత్పత్తులను విపణిలోకి విడుదల చేయనున్నట్లు చెప్పారు. 10 దేశాలకు చెందిన వివిధ రకాల బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నామని దీంతో 2020 నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహే శ్ కుమార్, సీటీవో సునీల్ మేధా పాల్గొన్నారు.