అక్టోబర్ కల్లా మలి విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో రూపొందించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్‌ఈ-ఈటీఎఫ్)ను అక్టోబర్ నాటికి మరో దఫా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు పుష్కలంగా నిధులు ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు కల్పించనుంది. దీపావళి లోగా ఈ న్యూ ఫండ్ ఆఫర్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఇందులో స్టాక్స్ యథాతథంగానే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
2014లో ప్రభుత్వం తొలిసారిగా 10 పీఎస్‌యూల స్టాక్స్‌తో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టినప్పుడు రూ. 3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ. 10 ముఖవిలువ ఉండే ఈటీఎఫ్ యూనిట్లలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ. 5,000- గరిష్టంగా రూ. 10 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు.