ముంబై: మొన్న ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్... నిన్న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్... నేడు న్యూ ఇండియా అష్యూరెన్స్!!. పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ బీమా కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచటం మాట అటుంచి... లిస్టింగ్ రోజే నష్టాలు చూపిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూకు ఎందుకు దరఖాస్తు చేశామా..! అని ఆలోచించేలా చేస్తున్నాయి.
సోమవారం నాడు ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అష్యూరెన్స్ షేర్లు మార్కెట్లో లిస్టవుతూనే... కుదేలయ్యాయి. ఇష్యూ ధర రూ.800తో పోలిస్తే ఏకంగా 9 శాతానికిపైగా క్షీణించాయి. సోమవారం బీఎస్‌ఈలో ప్రారంభంలోనే 6.38% తగ్గి రూ.748.90 వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. ఒక దశలో 10.28% మేర పతనమై రూ.717.75 స్థాయిని కూడా తాకాయి. చివరికి 9.36% నష్టంతో రూ.725.05 వద్ద క్లోజయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 9.11% తగ్గుదలతో రూ. 727.10 వద్ద ముగిశాయి.
బీఎస్‌ఈలో 4.3 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 25 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.59,744 కోట్లుగా ఉంది. దాదాపు రూ. 9,600 కోట్ల సమీకరణ కోసం నవంబర్ 1–3 మధ్య వచ్చిన న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవో 1.19 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. చిన్న మదుపరులు కనక ఐపీఓకు దరఖాస్తు చేసుకోకుండా సోమవారం లిస్టింగ్ తరువాత కొనుగోలు చేసి ఉంటే... ఈ షేర్లు 10% తక్కువ ధరకే లభ్యమై ఉండేవి. ఈ ఐపీఓకు ఎక్కువ మంది దరఖాస్తు చేయకపోవటంతో చేసినవారికి పూర్తి స్థాయిలో షేర్లు అలాట్ కావటం గమనార్హం.
ఎస్‌బీఐ లైఫ్, జీఐసీ కూడా అంతే..!!
ఇటీవల పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు ఎస్‌బీఐ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే తరహాలో ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. ఎస్‌బీఐ లైఫ్ షేర్లు రూ.700 చొప్పున అలాట్ చేయగా... లిస్టింగ్ నాడు మాత్రమే కొంత పెరిగాయి. ఆ తరువాత నుంచీ తగ్గుతూ వచ్చి... ప్రస్తుతం రూ.665 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ (జీఐసీ) షేరును రూ.912 చొప్పున ఇష్యూ చేశారు.
కానీ లిస్టింగ్ నుంచీ నష్టాలే చూపిస్తూ.. ప్రస్తుతం రూ.811 వద్ద ట్రేడవుతోంది. ఈ బీమా సంస్థలను లిస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వం వాటిలో తనకున్న వాటాను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత సమీకరించాలనేది ప్రభుత్వం ముందే టార్గెట్ పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆయా కంపెనీల షేర్లను భారీ ప్రీమియానికి విక్రయిస్తుండటంతో విలువ ఎక్కువ ఉందనే కారణంతో కొనుగోలుదార్లు ముందుకు రావటం లేదన్నది విశ్లేషకుల మాట. దీంతో పబ్లిక్ ఇష్యూకు స్పందన కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. ఫలితం!! లిస్టింగ్ అయ్యాక ఆయా షేర్లు నేలచూపులు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment