
ముంబై: ప్రయివేట్ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం జంప్‌చేసి రూ. 17,762 కోట్లను తాకింది.
వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్ విలువ(వీఎన్‌బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్‌బీ మార్జిన్ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్ కొత్త బిజినెస్ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment