ఆన్‌లైన్లో అమ్మ చేతి వంట! | new startup company easy cook pack | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో అమ్మ చేతి వంట!

Published Sat, Dec 17 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

ఆన్‌లైన్లో అమ్మ చేతి వంట!

ఆన్‌లైన్లో అమ్మ చేతి వంట!

ఈజీకుక్‌ ప్యాక్‌తో ఏ కూరలైనా వండటం తేలికే
ఫ్రెష్‌చాప్స్, బిగ్‌ బాస్కెట్‌లతోనూ ఒప్పందం
2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి
‘స్టార్టప్‌ డైరీ’తో ఈజీకుక్‌ ఫౌండర్‌ శశాంక్‌ కామిశెట్టి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటివరకు రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్‌ గురించే మనకు తెలుసు. కానీ, అంతకంటే తొందరగా పూర్తయ్యే కూరలు కూడా వచ్చేశాయి. పాలకూర పచ్చడి నుంచిమొదలుపెడితే చోలే మసాలా, రొయ్యలు, చేపల పులుసు, గోంగూర మటన్, నాటుకోడి కూర వరకూ అన్ని రకాల శాకాహార, మాంసాహార వంటలూ సులువుగా వండేసుకునే వీలుంది. అదికూడా అమ్మ చేతి వంటంత రుచిగా! మరిన్ని వివరాలు ఈజీకుక్‌.ఇన్‌ ఫౌండర్‌ శశాంక్‌ కామిశెట్టి ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు.

ఈజీకుక్‌ స్టార్టప్‌ కంటే ముందు హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ ప్రారంభించా. రెండేళ్ల పాటు సేవలందించా. ఆ సమయంలో గమనించిందొక్కటే.. మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ ఉద్యోగస్తులు కావటంతో ఇంట్లో వంట చేసుకునే సమయం,ఓపిక రెండూ లేక రెస్టారెంట్‌లోనో, చైనీస్‌ ఫుడ్‌ సెంటర్లలోనో తినడం తప్పనిసరవుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అలాగని ఇంట్లో వంట చేసుకోవాలంటే అంత తేలిక్కాదు. ఇలాంటి సమస్యలేమీ లేకుండావంట గదిలో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేసుకోకుండా.. కేవలం ఒక్క గిన్నె, ఒక గరిటెతో ఏ కూరైనా వండుకోవటానికి వీలు కల్పించేదే మా ఈజీకుక్‌. అల్లం పద్మతో కలిసి ఈ ఏడాది మార్చిలో రూ.15 లక్షలపెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా ఈజీకుక్‌.ఇన్‌ను ప్రారంభించాం.


కూరలు, వేపుళ్లు, పచ్చళ్లు కూడా..
ప్రస్తుతం ఈజీకుక్‌లో వెజ్, నాన్‌ వెజ్‌ కూరలతో పాటు కొన్ని రకాల వేపుళ్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నాం. శాకాహారంలో 26 రకాలు, మాంసాహారంలో 20 రకాలు, పలు రకాల వేపుళ్లు ఉన్నాయి. త్వరలోనే రైస్, స్వీట్‌ఐటమ్స్‌నూ తెస్తున్నాం. ప్రారంభ ధరలు చూస్తే పచ్చళ్లు 200 గ్రాములకు రూ.45, చికెన్‌ 380 గ్రాములకు రూ.105, మటన్‌ 380 గ్రాములకు రూ.220లుగా ఉన్నాయి. మేం పంపించే ప్రతి వస్తువూ నేరుగా రైతుల నుంచేకొంటాం.

కారం, పసుపు, అల్లం, ధనియాల వంటి దినుసులను కూడా నేరుగా రైతుల దగ్గరి నుంచి కొని మెయిన్‌ కిచెన్‌లో మసాలాలు తయారు చేస్తాం. ప్రస్తుతానికైతే వెబ్‌సైట్, ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ బుకింగ్‌చేయవచ్చు. త్వరలోనే ఐఓఎస్‌ యాప్‌నూ తెస్తున్నాం. ప్రస్తుతం గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లిహిల్స్, కొండాపూర్, కొత్తగూడ, మణికొండ, కూకట్‌పల్లి, నిజాంపేట, మదీనాగూడ, చందానగర్, మియాపూర్‌ ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నాం.

ఫ్రెష్‌చాప్స్, బిగ్‌బాస్కెట్‌తో ఒప్పందం..
కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రెష్‌చాప్స్, బిగ్‌ బాస్కెట్‌ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ప్రతి ఆర్డర్‌ మీద ఆయా సంస్థలకు 15–20 శాతం కమీషన్‌ వెళుతుంది. ప్రస్తుతం నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి.విస్తరణలో భాగంగా ఒక్కో ఏరియాకు ఒక్కో బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించాలని నిర్ణయించాం. వీరేం చేస్తారంటే సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో వారిచ్చే ప్రతి ఆర్డర్‌పై కమీషన్‌ను పొందుతారు. విస్తరణ కోసం నిధులుసమీకరిస్తున్నాం. 2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి చేస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement