
యాడ్రోబ్.. మన దుకాణం!
♦ ఒకే వేదికగా వర్తకులు, కస్టమర్లకు సేవలు
♦ గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకూ కొనే వీలు
♦ హైదరాబాద్‌లో షురూ; వచ్చే నెల్లో వరంగల్‌కు
♦ 2016-17లో మొత్తం 10 పట్టణాలకు విస్తరణ
♦ రూ.30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
♦ - ‘సాక్షి’తో యాడ్రోబ్ ఫౌండర్ ఎండీ రాజిరెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇపుడు ఆన్‌లైన్ షాపింగంటే తెలియనివారు లేరు. మరి పెద్దపెద్ద ఆన్‌లైన్ సంస్థల మధ్య చిన్న దుకాణాలు వెబ్‌సైట్ తెరవటం... కస్టమర్లను ఆకర్షించడం తేలికేమీ కాదు. వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్, పేమెంట్ గేట్‌వే, డెలివరీ వ్యవస్థ.. ఇలా చాలా పనులుంటాయి. గల్లీలోని చిన్న చిన్న కిరాణ దుకాణాలదారులు, స్థానిక వర్తకులకు ఇవన్నీ అయ్యే పనికాదు. అయితే వాళ్లకూ అందుబాటు ధరల్లోనే ఈ అవకాశాన్నిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యాడ్రోబ్. సంస్థ గురించి మరిన్ని వివరాలను దాని వ్యవస్థాపక ఎండీ రాజిరెడ్డి కే శిరెడ్డి ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
ఆన్‌లైన్‌లో అమ్మే ఏ వస్తువైనా ఆఫ్‌లైన్ నుంచే రావాలి. కానీ ఆఫ్‌లైన్లో వస్తువులమ్మే వారంతా ఆన్‌లైన్‌కు రాలేకపోతున్నారు. దీన్నే వ్యాపారంగా చేసుకుని నా భార్య ప్రనూషతో కలసి యాడ్రోబ్‌ను ఆరంభించా. రూ.కోటి పెట్టుబడితో గత అక్టోబర్లో సంస్థను ప్రారంభించాం.
యాడ్రోబ్ అంటే...
ఆఫ్‌లైన్ సంస్థలను, కస్టమర్లను అనుసంధానించేదే యాడ్రోబ్. ఇందులో యాడ్ అంటే అడ్వటైజ్‌మెంట్, రోబ్ అంటే అల్మరా అని అర్థం. అంటే మనం ఎలాగైతే అల్మరాలో ముఖ్యమైన వస్తువులను దాచుకొని అవసరమైనప్పుడల్లా బయటికి తీసి వాడుకుంటామో... అలాగే యాడ్రోబ్‌లో సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. వినియోగదారులు కొనొచ్చు.
ఒకే వేదికగా ఇద్దరికీ సేవలు..
♦ వర్తకుల విషయానికొస్తే.. యాడ్ రూపంలో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. చార్జీలు అద్దె రూపంలో ఉంటాయి. ప్రస్తుతం మా సంస్థలో వెయ్యి మంది వెండర్స్ నమోదయ్యారు. ఇందులో 100 మంది సొంతంగా యాప్‌ను వినియోగించుకుంటున్నారు.
♦ కస్టమర్ల విషయానికొస్తే.. యాడ్రోబ్‌లో గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ వందకు పైగా కేటగిరీలున్నాయి. వీటి ద్వారా సుమారు 4 వేలకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఫుడ్ తప్ప అన్ని ఉత్పత్తులనూ ఆర్డరిచ్చిన 24 గంటల్లో డెలివరీ చేస్తాం. అది కూడా పూర్తి ఉచితంగా. ఇప్పటివరకు 5వేల మంది కస్టమర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మా వద్ద రిటర్న్ పాలసీ లేదు. ఎక్స్‌చేంజ్ మాత్రం ఉంటుంది.
రూ.30 కోట్ల వరకూ నిధుల సమీకరణ..
గ్రోత్ క్యాపిటల్ కోసం నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే ముంబైకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్‌తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. రూ.30 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నారు. పూర్తి వివరాలు మరో ఆరు నెలల్లో వెల్లడిస్తాం. ఈ ఇన్వెస్టర్ గతంలో నాలుగైదు బిలియన్ డాలర్లు స్టార్టప్ సంస్థల్లో పెట్టారు. ప్రస్తుతం మా సంస్థలో 18 మంది ఉద్యోగులున్నారు. రెండు నెలల్లో స్థానికంగా 5 వేల మంది వర్తకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఐఓఎస్, విండోస్ వెర్షన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం.
తొలి ఏడాది రూ.3 కోట్ల టర్నోవర్ లక్ష్యం..
ప్రస్తుతం నెలకు 1,500 లావాదేవీలు చేస్తున్నాం. నెలకు సుమారు రూ.20-25 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. తొలి ఏడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం. లక్ష జనాభా ఉన్న ప్రతి పట్టణానికీ విస్తరించాలని నిర్ణయించాం, 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశంలోని 10 పట్టణాలకు విస్తరిస్తాం. తొలి విడతగా డిసెంబరుకల్లా విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, వరంగల్‌కు విస్తరిస్తున్నాం. వచ్చే నెలలో వరంగల్‌లో సేవలను ప్రారంభిస్తున్నాం. ప్రతి పట్టణంలో రూ.8-10 లక్షల పెట్టుబడి పెడతాం.
యాడ్రోబ్ సేవల్లో కొన్ని ప్రత్యేకమైనవి..
♦ ప్రతి వర్తకునికి ఒక్కో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఇందులో వర్తకుడి పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, గూగుల్ మ్యాప్‌నూ అందిస్తుంది.
♦ కొనుగోలులో ఏమైనా సందేహాలుంటే పక్కనే పుష్ టు కాల్, పుష్ టు మెయిల్ అనే ఆప్షన్లుంటాయి. వీటిని క్లిక్ చేస్తే సంబంధిత వెండర్‌కు నేరుగా కనెక్ట్ అవుతారు.
♦ జియో ఫెన్సింగ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే.. మనం ఉన్న చోటు నుంచి ప్రతి 5 కి.మీ.లను ఒక జియోగా గుర్తిస్తారు. ఈ పరిధిలో ఉన్న బెస్ట్ ఆఫర్లు అన్ని కేటగిరీల్లోనూ క్షణాల్లో మన ముందు డిస్‌ప్లే అవుతాయి.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...