రిస్క్‌ ఉన్నా పర్వాలేదనుకుంటే.. | news about sbi credit risk fund | Sakshi
Sakshi News home page

రిస్క్‌ ఉన్నా పర్వాలేదనుకుంటే..

Jul 2 2018 12:22 AM | Updated on Jul 2 2018 11:21 AM

news about sbi credit risk fund - Sakshi

పెరుగుతున్న వడ్డీ రేట్లతో అయోమయంలో ఉన్నట్లయితే... షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిస్క్‌ తగ్గించుకోవచ్చు. కానీ, రిస్క్‌ ఉన్నా పర్వాలేదనుకునే వారు కొంత మొత్తాన్ని క్రెడిట్‌ రిస్క్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదే.

ఆ కోవలోనిదే ఎస్‌బీఐ క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌. తక్కువ రేటింగ్‌ కలిగిన కార్పొరేట్‌ బాండ్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. బాండ్ల ధరల్ని మించి రాబడులను రాబట్టుకునే విధంగా దీని పనితీరు ఉంటుంది.  నిన్నటి వరకు ఈ పథకం ఎస్‌బీఐ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ పేరుతో నడిచింది. ఈ పథకం 55– 65 శాతం వరకు నిధుల్ని ఏఏ– అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

సాధారణంగా ఇవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. సెబీ మార్పుల తర్వాత కూడా పథకం పెట్టుబడుల విధానం మారలేదు. సెబీ ఆదేశాల ప్రకారం క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ తమ నిధుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఎస్‌బీఐ క్రెడిట్‌ రిస్క్‌ ఇప్పటికే అమలు చేస్తోంది. కనుక సెబీ మార్పుల ప్రభావం ఈ పథకం పనితీరుపై ఉండదనే చెప్పుకోవాలి.  

8 శాతంపైనే రాబడులు...
ఈ పథకం రాబడులు అన్ని కాల వ్యవధుల్లోనూ ఆశాజనకంగానే ఉన్నాయి. మూడు, ఐదేళ్ల కాలంలో 8 శాతంపైనే రాబడులనిచ్చింది. ఏడాది కాలంలో 5.2 శాతం, మూడేళ్ల కాలంలో 8.1 శాతం, ఐదేళ్ల కాలంలో 9.1 శాతం చొప్పున వార్షిక రాబడులున్నాయి. ఇదే విభాగంలోని కొన్ని పథకాలతో పోలిస్తే రాబడులు తక్కువే. అయితే, ఇతర పథకాలు తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే విధానం వేరుగా ఉండొచ్చు. కనక వాటితో పోల్చలేం.

ఉదాహరణకు ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ రాబడులు ఈ పథకంతో పోలిస్తే 1– 2 శాతం అధికంగా ఉన్నాయి. కానీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. కనుక రిస్క్‌ ఎక్కువుంటుంది. 90 శాతం నిధుల్ని ఏఏ– అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేయడం గమనించొచ్చు. మోస్తరు రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉండి, తగినన్ని రాబడులు ఆశించే వారికి ఎస్‌బీఐ క్రెడిట్‌ రిస్క్‌ అనుకూలమని చెప్పొచ్చు.

స్ట్రాటజీ ఎలా ఉండాలంటే...
కొన్ని డెట్‌ ఫండ్స్‌ భిన్న రేటింగ్‌లున్న బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అధిక వడ్డీ కోసం రిస్క్‌ తీసుకుంటాయి. ఒక్కటి బెడిసి కొట్టినా రాబడులు తల్లకిందులవుతాయి. అందుకే రిస్క్‌ అధికంగా ఉండేవే (తక్కువ రేటింగ్‌) అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తాయని గమనించాలి. కనుక రాబడుల కోసం వీటిని ఆశ్రయించే వారు, తమ రిస్క్‌ సామర్థ్యానికి పోలిన ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

ఈ ఫండ్స్‌ను ఆశ్రయించే ముందు, వాటి పెట్టుబడుల విధానం, ట్రాక్‌ రికార్డును కూడా పరిశీలించాలి. మరీ ఎక్కువ రిస్క్‌ తీసుకునే వారు వీటికి బదులు ఈక్విటీ, డెట్‌ ఫండ్స్‌తో కూడిన పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఈక్విటీ పథకాల్లో ఏవైనా కనీసం ఐదేళ్ల పాటు కొనసాగితే కానీ ఆశించిన మేర రాబడులు అందుకోలేం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement