
‘రూపాయి’ బలం... ఇటేమో భయం!
♦ ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి సంస్థలకు కష్టకాలం
♦ ఈ ఏడాదిలో ఇప్పటికే 6 శాతం బలపడ్డ రూపాయి
♦ డాలర్‌తో గత నవంబర్లో రూ.68... ఇప్పుడు రూ.64
♦ 62 స్థాయికి చేరితే నిఫ్టీ కంపెనీల ఆదాయం 4% డౌన్!
♦ దేశంలో ఆర్థిక వృద్ధి.. బీజేపీ విజయాలే కారణం
♦ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలతో
♦ మన బాండ్లలోకి భారీగా విదేశీ పెట్టుబడులు
సాక్షి, బిజినెస్ విభాగం : సంజయ్... ఓ మధ్యస్థాయి ఐటీ కంపెనీకి యజమాని. ఎక్కువగా విదేశీ కంపెనీలకు సర్వీసులందిస్తుంటాడు. దాదాపు రెండేళ్ల కిందట అమెరికా నుంచి వార్షికంగా 5 లక్షల డాలర్లు చెల్లించే కాంట్రాక్టు ఒకటి వచ్చింది. అంటే... అప్పట్లో మన కరెన్సీలో రూ.3.35 కోట్లన్న మాట. అప్పట్లో డాలరు విలువ రూ.67 దగ్గర ఉండేది. ఈ డాలరుధరను ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించాలనేది ఒప్పందంలో ఓ నిబంధన. నిజానికి డాలరు బలహీనపడి... రూపాయి బలపడినపుడల్లా సంజయ్‌కి ఇబ్బందే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డాలరు విలువ పడిపోయి రూ.64కు కూడా చేరేది. దీంతో ఆ కంపెనీ చెల్లించే డాలర్లను ఇక్కడ రూపాయిల్లోకి మార్చుకుంటే ఒకోసారి రూ.3.2 కోట్లే వచ్చేవి. అంటే ఆ ఏడాదికి రూ.15 లక్షలు నష్టమన్న మాట.!!
నిజానికిది సంజయ్ ఒక్కడి కథే కాదు. ఇపుడు రూపాయి బాగా బలపడి... రూ.64–63 స్థాయిల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం దాదాపు దేశీ ఐటీ కంపెనీలన్నిటిమీదా పడుతోంది. రూపాయి బలపడటమనేది దిగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకు మంచిదే కావచ్చు. ఎందుకంటే వాటికి కావాల్సిన వస్తువులు తక్కువ ధరకే తెచ్చుకోవచ్చు. కానీ ఎగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకిది ఇబ్బందే. ప్రధానంగా విదేశీ సంస్థలకు సర్వీసులు అందించటంపైనే ఆధారపడ్డ దేశీ ఐటీ కంపెనీలకు ఇది ఇంకా ఇబ్బంది. అందుకే 2016–17 సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఐటీ కంపెనీల లాభాలు బాగా తగ్గాయి. ఆ ప్రభావం ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల మీద కూడా కొంత పడుతోంది. లాభాలు తగ్గకుండా ఉండటం కోసం... మార్చిన్లు నిలబెట్టుకోవటం కోసం కంపెనీలు కొందరు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కూడా.
నిజం చెప్పాలంటే కొద్ది రోజుల కిందటిదాకా రూపాయి బాగా పతనమవుతూ వచ్చింది. ఏడు నెలల కిందట... అంటే గతేడాది నవంబర్లో ఏకంగా 68.80ని చేరింది. దీంతో దిగుమతులపై ఆధారపడ్డ కంపెనీలన్నీ తలలు పట్టుకున్నాయి. ఇది ఎక్కడిదాకా పెరుగుతుందోనని విపరీతంగా ఆందోళన చెందాయి. ఇంతలోనే సీన్ రివర్సయిపోయింది. రూపాయి బలపడి దూసుకెళ్లడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఇప్పటిదాకా డాలర్‌తో పోలిస్తే 6% మేర ఎగిసింది. ఇపుడు డాలర్‌తో పోలిస్తే రూ.63–64 స్థాయికి చేరింది. 7 నెలల్లో 400 పైసల పెరుగుదల అంటే మాటలు కాదు. ఎందుకంటే పలు కంపెనీలు కోట్ల డాలర్ల ఎగుమతులు చేస్తున్నాయి. వాటి ఆదాయ నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్న మాట.
ద్రవ్యోల్బణానికి మంచిదే
రూపాయి బలపడటం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఉపయోగపడేదే. ఇప్పటికే అమెరికాలో వర్కింగ్ వీసాలపై ఆంక్షలు, తరచూ ఎఫ్‌డీఏ తనిఖీలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశీ ఐటీ, ఫార్మా కంపెనీలకు మాత్రం ఇది రుచించని అంశం. వార్షికంగా చూస్తే భారత్ నుంచి టెక్నాలజీ ఉత్పత్తుల ఎగుమతులు 11,000 కోట్ల డాలర్ల మేర ఉంటున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో వీటి వాటా సుమారు 9 శాతం. టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన వాటితో పాటు పలు ఎగుమతి కంపెనీల ఆదాయాల్లో సింహ భాగం విదేశాల నుంచే వస్తోంది.
కొన్ని కంపెనీలకు 90 శాతం ఆదాయం విదేశాల నుంచే వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సన్, లుపిన్ వంటి ఫార్మా సంస్థల ఆదాయాల్లో కూడా 70 శాతం పైగా వాటా విదేశాలదే. రూపాయి మారకం విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ రంగ పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు రిలయన్స్ సెక్యూరిటీస్ సూచించింది. పలు ఐటీ కంపెనీల నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. నికర లాభంలో సగటున రెండు శాతం.. ఆదాయంలో 3% మాత్రమే వృద్ధి నమోదయింది.
బలపడటానికి కారణాలేంటి?
ఎగుమతి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న రూపాయి ర్యాలీకి పలు అంశాలు కారణం. బాండ్స్‌పై ఈల్డ్(రాబడి) అధికంగా ఉంటుండటం, ఎకానమీ 7%కి పైగా వృద్ధి సాధిస్తుండటం ఇందులో ఉన్నాయి. కొన్ని కీలక రాష్ట్రాల్లో అధికార బీజేపీ భారీ విజయంతో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు తోడ్పాటునివ్వగలదనే అంచనాలూ ఉన్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఫేవరెట్‌గా మారుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత బాండ్లు, ఈక్విటీల్లో 15 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయటమే దీనికి నిదర్శనం. దీంతో ఏప్రిల్ నెలాఖర్లో రూపాయి విలువ 20 నెలల గరిష్టానికి ఎగిసింది.
రూపాయి బలోపేతం ఎగుమతులను దెబ్బతీస్తుందని, మారకం విలువ సముచిత స్థాయిలో ఉండేలా ప్రభుత్వం చూడాలని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఈ మధ్య చెప్పారు కూడా. ఆర్‌బీఐ మాత్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెరిగే రూపాయిని అడ్డుకోకూడదని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా చెబుతోంది.
కంపెనీలకు కష్టమే..
డాలర్‌తో రూపాయి విలువ 62కి చేరిందంటే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50లోని సంస్థల ఆదాయాల్లో దాదాపు నాలుగు శాతం మేర తగ్గవచ్చని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ అనలిస్టు ప్రతీక్ పరేఖ్ చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి రూపాయి బలహీన పడొచ్చని, డాలర్‌తో పోలిస్తే 66.46 స్థాయికి చేరొచ్చని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి 1% పెరిగితే.. దేశీ ఐటీ ఎగుమతి కంపెనీల మార్జిన్లు 25–30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోవచ్చని అంచనా. రాబోయే త్రైమాసికాల్లో ఫార్మా కంపెనీల ఎగుమతి సంబంధ ఆదాయాలు 4–6% దాకా, సాఫ్ట్‌వేర్ సంస్థల ఆదాయాలు 2–3% దాకా తగ్గొచ్చని టీసీజీ గ్రూప్ భారత విభాగం ఎండీ చక్రి లోకప్రియ తెలిపారు. బహుళ మార్కెట్లకు ఎగుమతి చేసే కంపెనీ లకు సంక్లిష్టమైన హెడ్జింగ్ కారణంగా మరింత కష్టకాలం తప్పకపోవచ్చన్నారు.