బ్రాంచీలను మూసివేయం.. తరలిస్తాం..!
♦ ఐదు బ్యాంకుల విలీనానంతర స్థితిపై
♦ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
♦ అందరికీ బ్యాంకింగ్ అందుబాటు లక్ష్యమని వివరణ
న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంక్‌సహా అనుబంధ ఐదు బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఆయా విలీన బ్యాంకుల బ్రాంచీలు కొన్నింటిని మూసివేయడం జరుగుతుందన్న పుకార్లు, ఆందోళనలకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య తోసిపుచ్చారు. బ్యాంకు బ్రాంచీల తరలింపు ఉంటుంది తప్ప, మూసివేతలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని ఒక వార్తా సంస్థకు తెలిపారు. ‘‘జరుగుతున్న ప్రతికూల ప్రచారంలో ఇది ఒకటి. ఏ బ్రాంచీనీ మూసివేయం.
మూడు అనుబంధ బ్యాంకు బ్రాంచీలూ ఒకే బిల్డింగ్‌లో ఉంటే.. వాటిని అలానే కొనసాగించడంలో అర్థం ఉండదు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరానికి బ్రాంచీని తరలిస్తే, బ్యాంకింగ్ సేవలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయి. ఇదే లక్ష్యంతో కొన్ని బ్రాంచీలను తరలించడం జరుగుతుంది. ఈ విషయంలోనూ ఏకపక్ష చర్యలు ఏవీ ఉండవు. ఉమ్మడి, ఏకాభిప్రాయ ప్రాతిపదికననే ఈ చర్యలు ఉంటాయి. విలీనానంతరం ఎస్‌బీఐ బ్రాంచీలు 24,000 ఉంటాయి.
ఇదే సంఖ్య కొనసాగుతుంది. మేము తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకింగ్ సేవలు విస్తృతం అవుతాయి’’ అని అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. 2017 మార్చినాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని సైతం ఎస్‌బీఐ చీఫ్ వ్యక్తం చేశారు. కాగా విలీనం తరువాత ఎస్‌బీఐకి సంబంధించి పెరిగే మొండిబకాయిల పరిమాణంపై చర్యలూ అవసరమని అన్నారు.
బాధ్యతల పొడిగింపు వార్త వినలేదు...
అక్టోబర్‌లో భట్టాచార్య పదవీ విరమణ చేయనున్నారు. ఆమె నేతృత్వంలోనే విలీనం పూర్తయ్యేలా, ఏడాది కాలం బాధ్యతల పొడిగింపు అవకాశం ఉందని వస్తున్న వార్తలపై అరుంధతీ భట్టాచార్య స్పందిస్తూ, ‘‘ నా బాధ్యతల కాలం పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనా వినలేదు. అయితే మార్పులు సహజం. దానికి మనం సిద్ధం కావల్సిందే. అయితే ఎటువంటి పరిస్థితినైనా నిర్వహించడానికి తగిన పటిష్ట టీమ్ ఎస్‌బీఐకి ఉంది’’అని అన్నారు. ఎస్‌బీఐలో విలీనం అయ్యే బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు.
ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)లూ విలీన బాటలో ఉన్నాయి. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్‌బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. 24,000 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరిస్తుంది. ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది. 2008లో ఎస్‌బీఐలో తొలిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటుతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనం జరిగింది.