విద్యుత్ సంస్థలకు సర్కారు మొండిచేయి చూపించింది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలకు సర్కారు మొండిచేయి చూపించింది. రూ.7,716 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పంపిణీ సంస్థలు తెలిపాయి. ఇందులో రూ.1,261 కోట్లను టారిఫ్ రూపంలో పూడ్చుకోవాలని ప్రతిపాదించాయి. మిగిలిన రూ.6,455 కోట్లను ప్రభుత్వం ఉచిత విద్యుత్, గృహ విద్యుత్‌కు సబ్సిడీ రూపంలో ఇస్తుందని ఆశించాయి. కానీ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు వాటి ఆశలపై నీళ్లు చల్లాయి. బడ్జెట్‌లో కేవలం రూ.4,360 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన రూ.1,360 కోట్లను పలు పథకాలకోసం ఖర్చుచేయాలని ప్రతిపాదించారు.
వాస్తవానికి ఉచిత విద్యుత్‌కే రూ.4 వేల కోట్లు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తాజాగా రూ.మూడు వేల కోట్లను కేటాయించడం ద్వారా ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ క్రమంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ.. ఇందుకోసం ఈ ఏడాది పదివేల సోలార్ పంపుసెట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
దీంతోపాటు రెవెన్యూ లోటు భర్తీకి అంతర్గత చర్యలు చేపట్టాలని విద్యుత్ సంస్థలకు సూచించింది. ప్రభుత్వం తాజాగా సబ్సిడీలో కోత విధించడంతో లోటును ఎలా పూడ్చుకోవాలనే దానిపై విద్యుత్ సంస్థలు కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు విద్యుత్ భారం తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించే వీలుందని, కొన్ని రాయితీ వర్గాలపై భారం తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు.