సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు నూతన సంవత్సర కానుక అందజేసింది. రైల్వే ఛార్జీలను పెంచే ఆలోచనేది లేదని రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం శుభవార్త అందించింది. రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇవాల్టి లోక్‌సభ సమావేశాల్లో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజన్ గోహెన్ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ తీపి కబురు అందించారు. చార్జీలను పెంచబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానిమిస్తూ "ప్రస్తుతం ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదు" అని ఆయన చెప్పారు . ఏటికేడాది రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-నవంబరు 2017 నాటికి ప్రయాణీకుల రవాణాలో 0.68 శాతం పెరుగుదలను, ఢిల్లీ, ముంబైల మధ్య 0.99 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు వెల్లడించారు.
ప్రత్యేక కార్యక్రమాలకు, పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుందన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు నడుపుతున్న ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో బేసిక్ ఛార్జీలపై వివిధ స్థాయిల్లో 10 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిమాండ్‌కు అనుగుణంగా నడుపుతున్న సువిధ రైళ్లలోని ఛార్జీలు సైతం తత్కాల్ ఛార్జీల మాదిరిగానే ఉంటున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment