రూ.1000 నోటుపై ప్రభుత్వం క్లారిటీ
రూ.1000 నోటుపై ప్రభుత్వం క్లారిటీ
Published Tue, Aug 29 2017 6:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాన్ చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెడుతున్నారని వస్తున్న ఊహాగానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యమేమీ ప్రస్తుతానికి లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టంచేశారు. మళ్లీ రూ.1000 నోట్లను కొత్తగా తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలపై ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్త రూ.2000 నోట్లను, రూ.500 నోట్లను ఆర్బీఐ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. కానీ కొత్త సిరీస్‌లో రూ.1000 నోట్లను మాత్రం మార్కెట్‌లోకి తీసుకురాలేదు.
ఇటీవల కాలంలో కొత్త రూ.1000 నోట్లను ప్రజల్లోకి మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.200, రూ.500, రూ.2,000ల మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి తిరిగి రూ.1,000 నోటును తీసుకురానున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ వీటిని తిరిగి చలామణిలోకి తెచ్చే ఆలోచనేమీ లేదని ప్రభుత్వం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన చిల్లర కొరత సమస్యకు పరిష్కారంగా ఇటీవలే ఆర్బీఐ కొత్తగా రూ.200 నోట్లను, రూ.50 నోట్లను ప్రవేశపెట్టింది.
Advertisement