రూపాయికే 51 శాతం వాటా!
♦ ముంద్రా పవర్ ప్రాజెక్టులో
♦ ఆఫర్ చేస్తున్న టాటా పవర్
న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న ముంద్రా పవర్ ప్రాజెక్టును గట్టెక్కించేం దుకు టాటా పవర్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 51% వాటాలను రూ.1 కే విక్రయిస్తామంటూ తమ దగ్గర్నుంచి విద్యుత్ కొనుగోలు చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. మరికాస్త అధిక రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేసే హామీ లభిస్తే కేవలం 49% వాటా మాత్ర మే ఉంచుకుని, నిర్వహణకు మాత్రమే తాము పరిమితం అవుతామని ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటా పవర్ విభాగం కోస్టల్ గుజరాత్ పవర్ (సీజీపీఎల్) పేర్కొంది.
గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్‌కి ఈ మేరకు లేఖ రాసింది.రూ. 2.26కే యూనిట్‌ను విక్రయించేలా 2006లో ప్రాజెక్టును టాటా దక్కించుకుంది. అయితే, బొగ్గు విషయంలో అంచనాలు తప్పడంతో అధిక ధర కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ముంద్రా నష్టాలు రూ. 6,457 కోట్లు కాగా, రుణభారం రూ. 10,159 కోట్లు. కంపెనీ చెల్లింపు మూలధనం రూ. 6,083 కోట్లు.