టాటా పవర్ భారీ ప్రణాళికలు
న్యూఢిల్లీ: 2030 నాటికి నిర్వహణ సామర్థ్యాలను రెట్టింపు స్థాయికి పెంచుకోవడంపై టాటా పవర్ దృష్టి పెట్టింది. 31.9 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామరర్థ్యాన్ని సాధించే దిశగా రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా ఈ విషయాలు వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ స్థాపిత సామర్ధ్యం 15.6 గిగావాట్లుగా ఉంది.
ఇందులో పునరుత్పాదక విద్యుత్ విభాగం వాటా 6.7 గిగావాట్లుగా ఉండగా.. ఇది 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి సామర్ధ్యంలో 23 గిగావాట్లకు పెరగనుంది. మరోవైపు, ట్రాన్స్‌మిషన్ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు సిన్హా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 4,633 సీకేఎంగా (సర్క్యూట్ కిలోమీటర్స్) ఉన్న ట్రాన్స్‌మిషన్ లైన్ల సామర్థ్యాన్ని 10,500 సీకేఎంకి పెంచుకోనున్నట్లు వివరించారు.
అలాగే కస్టమర్ల సంఖ్యను 1.25 కోట్ల నుంచి 4 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిన్హా చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 21,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 26,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 61,542 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని 2030 నాటికి రూ. 1 లక్ష కోట్లకు, నికర లాభాన్ని రూ. 4,100 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సిన్హా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment