రీచార్జ్ కాదు.. డబ్బులూ రావు!! | no recharges for wallet money Compulsory Purchases e-commers | Sakshi
Sakshi News home page

రీచార్జ్ కాదు.. డబ్బులూ రావు!!

Published Wed, Mar 9 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

రీచార్జ్ కాదు.. డబ్బులూ రావు!!

రీచార్జ్ కాదు.. డబ్బులూ రావు!!

అర్ధంతరంగా నిలిచిపోతున్న లావాదేవీలు
వాలెట్లలో ఉండిపోతున్న కస్టమర్ల సొమ్ము
తప్పనిసరిగా దాన్లోనే వాడాల్సిన అగత్యం
నిర్బంధ కొనుగోళ్లకు తెరతీస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సారథి ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ఓ మొబైల్ కంపెనీకి చెందిన ప్రీపెయిడ్ కనెక్షన్ వాడుతున్నాడు. ఎప్పుడు రీచార్జి చేయాలన్నా ఏదో ఒక ఔట్‌లెట్లోనో, దగ్గర్లోని సూపర్ మార్కెట్లోనో చేయించేస్తుంటాడు. కాకపోతే ఇపుడు ఆన్‌లైన్లో బోలెడన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిద్వారా రీచార్జి చేయిస్తే కాస్త అదనపు టాక్‌టైమ్ కూడా వస్తుందన్న ఆఫర్లు చూసి... ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవటంతో ఆన్‌లైన్లోనే చేయిద్దామని ఫిక్సయ్యాడు. అనుకున్నదే తడవుగా ఓ యాప్ ద్వారా రీచార్జ్ చేయటానికి ప్రయత్నించాడు. ఆన్‌లైన్ పేమెంట్‌ను ఎంచుకుని... తన ఆన్‌లైన్ బ్యాంకు ఖాతా నుంచే పేమెంట్ చేశాడు. కాకపోతే సరిగ్గా నగదు చెల్లించిన తరవాత ఆ యాప్ స్లో అయిపోయింది. ‘‘ప్రాసెసింగ్ ఎర్రర్’’ అంటూ వచ్చి... రీఛార్జ్ మధ్యలో ఆగిపోయింది.

మొత్తానికి డబ్బులైతే చెల్లించేశాడు కానీ రీచార్జ్ మాత్రం జరగలేదు. పోనీ తన డబ్బులు తిరిగి అకౌంట్‌లోకి వచ్చేస్తాయి కదా!! అనుకున్నాడు. కానీ అలా రాలేదు. ఆ డబ్బులు యాప్ తాలూకు వాలెట్‌లోనే పాయింట్ల మాదిరిగా ఉండిపోయాయి. దాంతో చేయించుకుంటే మళ్లీ రీచార్జి చేయించుకోవాల్సిందే తప్ప ఆ డబ్బులు వేరేగా ఉపయోగించడానికి కుదరదు. తక్షణం రీచార్జి అవసరం కనక దగ్గర్లోని షాప్‌లో చేయించేసుకున్నాడు. కానీ వ్యాలెట్‌లో డబ్బులు మాత్రం అలాగే ఉండిపోయాయి. అదీ కథ. నిజానికిది సారథి ఒక్కడి సమస్యే కాదు. చాలామంది వినియోగదారులకు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది.

 ముందుగా అలవాటు చేసి...
సాధారణంగా టెలికం సంస్థలన్నీ తమ సొంత వెబ్‌సైట్ల ద్వారా కూడా రీచార్జ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిద్వారా రీచార్జ్ చేసినపుడు ఒకవేళ మధ్యలో ఫెయిలైతే చెల్లించిన సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్‌లో కాస్త ఆలస్యమైనా... అయితే రీచార్జ్ కావటమో, లేదంటే డబ్బులు వెనక్కి తిరిగి రావటమో జరుగుతుంది. కానీ వ్యాలెట్లు, మొబైల్ రీచార్జి యాప్‌ల విషయంలో మాత్రం ఇలా జరగటంలేదు. ఈ విషయంలో వినియోగదారుకు ముందుగా సూచన చేయటమో, హెచ్చరించటమో కూడా లేదు. ‘‘మొదట్లో ఈ యాప్‌ల ద్వారా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రీచార్జి లావాదేవీలు సాఫీగా సాగేవి. డిస్కౌంట్లు కూడా ఇస్తూ కస్టమర్లను బాగా అలవాటు చేశాక ఇపుడు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి’’ అని ఓ వినియోగదారుడు వాపోయాడు.

వాలెట్లో కస్టమర్ డబ్బు..
వాలెట్లో ఉన్న డబ్బులను వాడుకోవాలంటే ఒక వస్తువును ఆన్‌లైన్లో కొనాలి. ఇప్పుడీ వెబ్‌సైట్లు ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఏదైనా వస్తువు కొనాలంటే వాలెట్లో ఉన్న డబ్బులు సరిగ్గా సరిపోయే అవకాశం ఉండదు కనక మరికొంత నగదును జోడించాలి.  ఇక కొన్ని యాప్‌లలో గనక పాయింట్ల రూపంలో డబ్బులు ఉండిపోతే... మళ్లీ రీచార్జి మాత్రమే చేయించుకోవాలి. రీఛార్జి ఎంతపడితే అంత చేయించలేం. దానిక్కూడా కొంత జోడించటమో... లేకపోతే అందులో ఇంకా కొంత డబ్బు ఉండిపోవటమో జరుగుతుంది.

అలా ఉండిపోయిన పక్షంలో మరోసారి రీచార్జి చేయించడానికి మరికొంత జోడించాలి. ఇలా కస్టమర్లను ఎప్పటికీ తమ యాప్‌పైనే ఆధారపడేలా చేయటమన్నది వీటి వ్యాపార వ్యూహాల్లో ఒకటని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రూ.150 రిచార్జ్ చేయబోతే ఆ డబ్బులు కాస్తా వాలెట్‌లోకి పోయాయి. రీచార్జి అత్యవసరం కావటంతో నేరుగా టెలికం పోర్టల్ నుంచే పని పూర్తి చేశా. ఆ డబ్బులు మాత్రం ఇప్పటికీ అందులోనే ఉన్నా యి’’ అని సురేష్ అనే మరో వినియోగదారుడు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement