వాహన అమ్మకాలు అంతంతే!
పండుగల సీజన్.. నవంబర్‌లో నిరాశ
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అయిన నవంబర్ నెలలో వాహన అమ్మకాలు స్వల్పంగానే పెరిగాయి. విక్రయాలు వృద్ధి చెందినప్పటికీ, అంచనా వేసిన స్థాయిలో పెరుగుదల లేదని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించగా, హోండా కార్స్, టయోటా అమ్మకాలు మాత్రం పడిపోయాయి.
కాగా పండగ సీజన్ కావడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, వడ్డీరేట్లు తగ్గడం వంటి అంశాలు కారణంగా గత రెండు నెలల్లో వాహన విక్రయాలు పుంజుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. జీఎస్‌టీ త్వరగా అమల్లోకి వస్తే, భారత వాహన పరిశ్రమ సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. హ్యుందాయ్ అమ్మకాలు నవంబర్ నాటికి మొత్తంగా 40 లక్షలను దాటడం ముఖ్యాంశం.