'ఆడ్ ఈవెన్' ఎత్తుకు పై ఎత్తు!
నోయిడాః ఢిల్లీలో ప్రవేశ పెట్టిన 'ఆడ్ ఈవెన్ స్కీమ్' ఆటో మేకర్స్ కు కలసి వచ్చింది. నోయిడా ఆర్టీవో లెక్కలను బట్టి చూస్తే సరి బేసి పద్ధతిని ప్రవేశ పెట్టిన జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. వాహనం లేనిదే ప్రయాణం చేయలేని వినియోగదారులు ఆడ్ ఈవెన్ పద్ధతిని అధిగమించేందుకు ఏకంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకూ వెనుకాడటం లేదు.
ఢిల్లీలో అమల్లోకి తెచ్చిన సరి బేసి పథకం సమస్య నుంచి బయట పడేందుకు నగరవాసులు కొత్వ వాహనాల కొనుగోళ్ళు చేపడుతున్నారు. నోయిడా వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఢిల్లీ, గుర్గాంవ్ లో ఉద్యోగాలకు, పనులకు వెళ్ళాల్సిన ప్రజలు... అత్యధిక దూరం ప్రయాణించాల్సి రావడంతో సిస్టమ్ ను అధిగమించే మరో మార్గం లేక వాహనాల కొనుగోళ్ళకు సిద్ధపడుతున్నారు. ఒక్క జనవరి నెలలోనే నోయిడాలో 1,887 ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది డిసెంబర్ లోని 1,614 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే సుమారు 17 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో కొంత శాతం తగ్గినా తిరిగి ఏప్రిల్ లో అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం సరి బేసి పథకం అమలు కాని నెలల్లో అత్యధిక కొనుగోళ్ళు జరిగినట్లు తెలుస్తోంది.
మొదటి పది రోజుల్లో పెద్దగా రిజిస్ట్రేషన్లు లేకపోయినా ఏప్రిల్ 15 నుంచి 'ఆడ్ ఈవెన్' పద్ధతి అమల్లోకొస్తుందని తెలియడంతో నోయిడా ఆర్టీవో పరిథిలో ఏకంగా 712 కార్లు రిజిస్టర్ అవ్వడం పరిస్థితిని అవగతం చేస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఏప్రిల్ నెలాఖరు నాటికి 2,136 కార్ల వరకూ... అంటే సుమారు 36 శాతం రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరి బేసి పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత డిసెంబర్ లో 3,676 గా ఉన్న ద్విచక్రవాహనాలు సహా ప్రైవేటు వాహనాల కొనుగోళ్ళు జనవరి నాటికి 5,237 కు పెరిగాయని దీన్ని బట్టి 42 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు.