రూపాయిపై ఆందోళన అక్కర్లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: దేశీ కరెన్సీ విలువకు తీవ్రమైన ముప్పేమీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్య సభలో చెప్పారు. గత కొద్దిరోజులుగా పడుతూ వస్తున్న డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ స్థిరపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, అమెరికా డాలరు విలువ అంతర్జాతీయంగా బలపడుతుండటంతో.. వర్ధమాన దేశాల కరెన్సీల న్నీ భారీగా పడిపోతున్నాయని.. వాటితో పోలిస్తే.. మన రూపాయి కాస్త మెరుగైన స్థితిలోనే ఉందని ఆయన జైట్లీ పేర్కొన్నారు. 61 స్థాయి నుంచి రూపాయి వేగంగా 64 సమీపానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 63.30 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతున్న చమురు ధరలవల్ల చేకూరే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించనున్నట్లు జైట్లీ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతున్న చమురు ధరలవల్ల చేకూరే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించనున్నట్లు జైట్లీ చెప్పారు. మరోపక్క పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపును సమర్థించుకుంటూ సామాజిక పథకాల వ్యయాలకు నిధులను పెంచుకోవలసి ఉన్నదని చెప్పారు.
అధిక పన్నుల విధానం .. ‘ప్రజా వ్యతిరేకం’
దేశాన్ని నడిపేందుకు మరింత అధిక పన్నులు విధించాలన్న ఆలోచనకు ప్రభుత్వం పూర్తి విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇలాంటివి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, గణనీయమైన పన్ను రాబడులను ప్రభుత్వం వదిలేసుకుంటోందన్న ఆందోళనలను కూడా ఆయన కొట్టి పారేశారు. గృహ నిర్మాణ రంగానికి సంబంధించి పన్ను మినహాయింపులను ప్రస్తావిస్తూ.. ప్రజలకు శ్రేయస్కరమైనదనే ఉద్దేశంతోనే దీన్ని ప్రకటించామని జైట్లీ పేర్కొన్నారు.