నోకియా 3310 వస్తోంది..
నెలరోజుల్లో అందుబాటులోకి
హైదరాబాద్, బిజి నెస్ బ్యూరో: కింగ్ ఆఫ్ ద ఫీచర్ ఫోన్‌గా నోకియా అభివర్ణిస్తున్న 3310 మోడల్ త్వరలో భారత్‌లో దర్శనమీయబోతోంది. ఏప్రిల్ చివరకు లేదా మే తొలివారంలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.
ఈ మోడల్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ రూ.3,000–3,500 మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. 2.4 క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా, సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ వంటి ఫీచర్లున్నాయి.
నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. ఇందులోని స్నేక్ గేమ్ అదనపు ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 3310 తయారవుతోంది. ఫోన్ విడుదలైన ఒకటిరెండు నెలల్లోనే 15 లక్షల యూనిట్లు అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. అన్ని మొబైల్ షాపుల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
పాత తరం 3310 అందుబాటులో ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బేసిక్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక కంపెనీ నుంచి ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు అయిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 జూన్ తొలివారంలో కస్టమర్ల చేతుల్లోకి రానున్నాయి. హెచ్‌ఎండీ గ్లోబల్ ద్వారా 120 దేశాల్లో నోకియా కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి.