నోకియా–8 @ రూ.36,999 | Nokia 8 destroys the competition at Rs 36999 | Sakshi
Sakshi News home page

నోకియా–8 @ రూ.36,999

Published Wed, Sep 27 2017 12:53 AM | Last Updated on Wed, Sep 27 2017 3:46 AM

Nokia 8 destroys the competition at Rs 36999

న్యూఢిల్లీ: నోకియా తనను తాను మళ్లీ నిరూపించుకోవాలనుకుంటోంది. పోయిన గత వైభవాన్ని దక్కించుకోవటానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అనతికాలంలోనే ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ దిగ్గజాల సరసకు చేరాలని వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే 3–5 ఏళ్లలో దీన్ని సాధిస్తామని నోకియా బ్రాండింగ్‌ హక్కులను చేజిక్కించుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇండియా) అజయ్‌ మెహతా ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల మార్కెట్‌లోకి తీసుకువచ్చిన స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారాయన.

‘బ్రాండ్, స్వచ్ఛమైన ఆండ్రాయిడ్, డిజైన్, నిజ జీవిత అనుభవాలు అనే నాలుగు స్తంభాలపై నోకియా నిలబడి ఉందని మేం విశ్వసిస్తున్నాం. ఇవే అస్త్రాలుగా ప్రత్యర్థులను ఎదుర్కొంటాం’ అన్నారాయన. మంగళవారమిక్కడ ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మారుతున్న ట్రెండ్‌కు అనువుగా పరిగెత్తలేకపోవడం సహా డ్యూయెల్‌ సిమ్, టచ్‌స్క్రీన్‌ మొబైల్స్‌ వంటి వాటికి ప్రాధాన్యమివ్వకపోవడం వల్ల నోకియా మార్కెట్‌ వాటా తగ్గిపోయింది. 2012 చివరికి ఏకంగా 10 శాతంలోపునకు పడిపోయింది. ఇక ఒప్పొ, షావోమి వంటి చైనా కంపెనీల రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.  

నోకియా–8 ప్రత్యేకతలు
హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.36,999గా ఉంది. ఇందులో 5.3 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,090 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఈ ఫోన్లు అక్టోబర్‌ 14 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన రిటైల్‌ స్టోర్లు సహా ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌.ఇన్‌లో నోకియా–8 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement