5జీ స్మార్ట్‌ఫోన్లు
2జి శకం ముగిసింది. 3జీ కూడా ముగిసిపోయి కాలం 4జీ వైపు పరుగులు పెడుతోంది. అయితే త్వరలో 4జీ శకం కూడా ముగిసిపోయి 5జీ వైపు అడుగులు వేగంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 5జీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్టు తెలుస్తోంది. క్వాల్‌కామ్, ఇంటెల్ రెండూ కూడా కొన్ని నెలల నుంచి దీనిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని, 2018 చివరి వరకు లేదా 2019 ప్రారంభంలో 5జీ కేపబుల్ తొలి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రానున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. 2019లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ మోడమ్స్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు 18 ఫోన్ తయారీదారి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్టు క్వాల్‌కామ్ ప్రకటించింది. ఈ కంపెనీల్లో నోకియా/హెచ్‌ఎండీ, సోని, షావోమి, ఒప్పో, వివో, హెచ్‌టీసీ, ఎల్‌జీ, ఆసుస్, జడ్‌టీసీ వంటి కంపెనీలున్నట్టు పేర్కొంది.
ఈ అన్ని కంపెనీలు కమర్షియల్ వాడకం కోసం 2019లో 5జీ డివైజ్‌లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాక స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడమ్స్‌ను విడుదల చేసినట్టు కూడా ధృవీకరించింది. తర్వాత తరం 5జీ మొబైల్ అనుభవాన్ని తన వినియోగదారులకు అందించడానికి క్వాల్‌కామ్ టెక్నాలజీస్ ఎంతో అంకితభావంతో పనిచేస్తుందని క్వాల్‌కామ్ టెక్నాలజీస్ ఇంక్ మొబైల్, జనరల్ మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ కటౌజియాన్ తెలిపారు. అయితే 5జీ స్మార్ట్‌ఫోన్లను అందించే కంపెనీ జాబితాలో ఆపిల్, శాంసంగ్, హువావే లేకపోవడం గమనార్హం. ఆపిల్‌కు గత ఏడాదిగా క్వాల్‌కామ్‌తో న్యాయ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వాల్‌కామ్‌తో కలిసి ఆపిల్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ఆపిల్ తన మోడమ్ ఆర్డర్స్‌ను ఇంటెల్ నుంచి స్వీకరిస్తుంది. శాంసంగ్ తన సొంత ఎక్సీనోస్ చిప్‌సెట్‌నే 5జీ కోసం వాడనుంది. క్వాల్‌కామ్ చిప్స్‌ను ఇది వాడటం లేదు. శాంసంగ్ తొలి 5జీ చిప్‌ను ఎక్సీనోస్ 5జీగా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ చిప్‌ను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment