
ముంబై: జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్ప టికీ సారథ్య బాధ్యతలు వహించగలిగే వారిని తగినంత స్థాయిలో దొరకపుచ్చుకోవడం కష్టంగా ఉంటోందని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఈ పరిస్థితి మారి లీడర్లుగా మరింత మంది మహిళలను చూడగలమని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే పరిస్థితులు మారుతున్నాయని, కానీ ఈ వేగం ఆశించినంత స్థాయిలో ఉండటం లేదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మజుందార్ షా పేర్కొన్నారు.
మహిళలకు సాధికారత కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద హోదాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా కంపెనీల బోర్డుల్లో సంఖ్యాపరంగా మహిళా డైరెక్టర్లు తక్కువగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.