
వాషింగ్టన్: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 10 ఏళ్ల కాలంలో ప్రగతి స్పష్టంగా ఉందంటూ, సంస్కరణల ఎంజెడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సంస్కరణలను ఉపసంహరించుకుంటే, రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇది నియంత్రణ, పర్యవేక్షణ మరింత పడిపోయేందుకు దారితీస్తుందని అభిప్రాయపడింది. సైబర్ సెక్యూరిటీ రిస్క్ పెరగడం వల్ల ఆర్థిక సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని... ఈ విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు సదా అప్రమత్తంగా ఉండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది.