
ఇక మద్యానికో స్పెషల్ స్టాక్ మార్కెట్
దేశ రాజధాని ఇప్పుడు ఒక కొత్త "స్టాక్ మార్కెట్" ఆవిష్కారానికి కేంద్రమైంది. మామూలు స్టాక్ మార్కెట్లలోని స్టాక్ ల కంటే చాలా విభిన్నమైన 'వైన్ స్టాక్ మార్కెట్.' అ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఇప్పుడు ఒక కొత్త "స్టాక్ మార్కెట్" ఆవిష్కారానికి కేంద్రమైంది. మామూలు స్టాక్ మార్కెట్లలోని స్టాక్ ల కంటే చాలా విభిన్నమైన 'వైన్ స్టాక్ మార్కెట్.' అవును, మీరు చదవింది నిజమే. స్టాక్ మార్కెట్ అనేది ఆయా కంపెనీల వాటా (స్టాక్) లు కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే వ్యవహారం. కానీ ఈ తాజా వైన్ స్టాక్ మార్కెట్ లో పేరుకు తగ్గట్టే మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయన్న మాట.
ముంబై లో దలాల్ స్ట్రీట్ మనీ ట్రేడింగ్ జరిగితే ఇక్కడ మాత్రం మద్యం ట్రేడింగ్ జరుగుతుందని దీని వ్యవస్థాపకులైన హిమాంశు గుప్త, విదిత్ గుప్త తెలిపారు. ఇతర స్టాక్ మార్కెట్లలోలాగానే తమ బార్ స్టాక్ మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా మద్యం ట్రేడింగ్ జరుగుతుందని చెప్పారు. ఇందులో కూడా పెట్టుబడులు, అంచనాలు, లాభాలు,నష్టాలు ఉంటాయన్నారు. తమ మార్కెట్ కూడా క్రాష్ అవుతుందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమకిష్టమైన వైన్ లేదా స్కాచ్ స్టాక్ ట్రేడింగ్ జరుపుకోవచ్చన్నారు. ఆర్డర్ ఫ్రీక్వెన్సీ ని బట్టి డిమాండ్ పెరగడం, క్షీణత, ధరలు పెరగడం, తగ్గడం ఉంటుందని, కొత్తగా నమోదు చేసిన బేస్ ధరతో మళ్ళీ అన్ని మరుసటి రోజు మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
మద్యం ప్రియుల కోసం మంచి రెస్టారెంట్ కావాలని కోరుకునే వారమని, ఆ క్రమంలోనే ఈ స్టాక్ మార్కెట్ రూపుదిద్దుకుందని విదిత్ తెలిపారు. దీనికి ఢిల్లీలోని కన్నాట్ ప్రదేశ అనువైందిగా భావించామన్నారు. తమ కెఫే దలాల్ స్ట్రీట్ లో 150 మంది సీటింగ్ కెపాసిటీ తో బార్అండ్ రెస్ట్రో లో అతి చవక ధరల్లో, నాణ్యమైన ఆహారంతోపాటు, వివిధ రకాల మద్యంతో క్లాసీ ఫీలింగ్ అందిస్తుందని తెలిపారు. అన్నట్టు ఇక్కడ మహిళలకోసం ప్రత్యేక కాక్ టైల్ ఉంటుందన్నారు. ఈ కెఫే లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. సొంత చేతులతో సృష్టించిన ఈ స్టాక్ మార్కెట్ ఒకవిధంగా తమకు బిడ్డలాంటిదని వ్యాఖ్యానించారు.