
ముంబై: క్రూడ్ ధరల పెరుగుదల భయానికి రూపాయి పతనమయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో మంగళవారం ఒకేరోజు 53 పైసలు పతనమై 70.21 వద్ద ముగిసింది. సోమవారం రూపాయి ముగింపు 69.68. ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి బలహీనంగా 69.83 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 70.23ను కూడా తాకింది.ముఖ్యాంశాలు చూస్తే...
►క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్ బిల్లు దేశానికి అదనపు భారం అవుతుంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటుపై (క్యాడ్– దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూల ప్రభావం చూపుతుంది.
►ఆయా అంశాల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ రావడం రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. యన్ (జపాన్), పౌండ్ (బ్రిటన్), యూరో (యూరప్) కరెన్సీలపై అమెరికా డాలర్ బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యింది.
►రెండు రోజుల ట్రేడింగ్ వరుల లాభాల తర్వాత రూపాయి బలహీనత ఇదే తొలిసారి. గడచిన రెండు రోజుల్లో రూపాయి 52 పైసలు బలపడింది.
► అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 70.16 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ 95.55 వద్ద ట్రేడవుతోంది.
► ఇక ఇదే సమయానికి భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధర బేరల్‌కు 58.50 వద్ద ట్రేడవుతుండగా (డిసెంబర్ చివరి వారంలో 52 వారాల కనిష్ట స్థాయి 49.93 డాలర్లు). ఇక నైమెక్స్ క్రూడ్ ధర రెండు వారాల క్రితం 42.36కాగా, ఈ వార్తరాసే సమయానికి 49.50 వద్ద ట్రేడవుతోంది.