చమురు షేర్లకు ధరల రెక్కలు | Oil shares zoom despite Crude price rise | Sakshi
Sakshi News home page

చమురు షేర్లకు ధరల రెక్కలు

Published Tue, May 19 2020 12:43 PM | Last Updated on Tue, May 19 2020 1:50 PM

Oil shares zoom despite Crude price rise - Sakshi

అంతర్జాతీయ మార్కెట్లలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిలో రష్యా, ఒపెక్‌ కోతలు విధించడం సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థల రికవరీకి దోహదపడగలవన్న అంచనాలు సైతం దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.సోమవారం లండన్‌ మార్కెట్లో 7 శాతం జంప్‌చేసిన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ తాజాగా మరికొంత పుంజుకుని 35 డాలర్లకు చేరింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ ముందురోజు 8 శాతం ఎగసిన నైమెక్స్‌ బ్యారల్‌ 32.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక, తదితర కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.చమురు ఉత్పాదక కౌంటర్లపై సబ్సిడీ భారం తగ్గనుండగా..పెట్రో మార్కెటింగ్‌ షేర్లు సైతం కళకళలాడుతున్నాయి. రిఫైనింగ్‌ మార్జిన్లు బలపడే వీలుండటం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..

జోరుగా హుషారుగా
మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 78కు చేరింది. ఈ బాటలో ఆయిల్‌ ఇండియా 6.5 శాతం ఎగసి రూ. 84ను తాకగా.. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ 5.2 శాతం లాభంతో రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇంద్రప్రస్థ గ్యాస్‌ 2.3 శాతం పుంజుకుని రూ. 456 వద్ద కదులుతోంది. తొలుత ఈ షేరు 460 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ 1.5 శాతం బలపడి రూ. 183 వద్ద, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 1.5 శాతం పెరిగి రూ. 73 వద్ద, హెచ్‌పీసీఎల్‌ 1 శాతం పుంజుకుని రూ. 175 వద్ద, బీపీసీఎల్‌ 1 శాతం లాభంతో రూ. 297 వద్ద ట్రేడవుతున్నాయి.ఇంట్రాడేలో బీపీసీఎల్‌ 304ను, హెచ్‌పీసీఎల్‌ రూ. 180నూ అధిగమించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement