సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఫుడ్‌పాండా భారత వ్యాపార్యాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఓలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్‌కు చెందిన డెలివరీ హీరో గ్రూప్ నుంచి ఫుడ్‌పాండా భారత వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఓలా ప్రకటించింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.
ఈ ఒప్పందం ప్రకారం ఆహారపదార్ధాల వ్యాపారం ఓలాకు బదిలీ అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్ల బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు.
2014 లో, ఓలా కేఫేతో ఓలా ఆహార పంపిణీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తన సేవలను విస్తరించింది. తరువాత మూసివేసింది. అయితే ఉబెర్ ఈట్స్‌కు పోటీగా ఫుడ్ పంపిణీ వ్యాపారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో ఫుడ్‌పాండాను కొనుగోలు చేయడం కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్‌లైన ఫుడ్ సర్వీసుల సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి.
ఇండియాలో ఫుడ్ సర్వీసులను మరింత అభివృద్ధి చేసే కృషిలో ఈ భాగస్వామ్యంపై సంతోషిస్తున్నామని, ఫుడ్ పాండా ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. తమ తాజా భాగస్వామ్యం మార్కెట్ల ఏకీకరణకు అనుమతిస్తుందని డెలివరీ హీరో గ్రూపు సహ-వ్యవస్థాపకుడు, సీఈవో నిక్లాస్ ఓస్టర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓలాలో తమ వాటా చాలా విలువైన ఆస్తిగా పరిగణిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment