న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ).. కేజీ బేసిన్‌లోని కేజీ–డీ5 బ్లాక్ నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 డిసెంబర్ దాకా వాయిదా వేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నులు (జీఎస్‌టీ), స్థానిక ఉత్పత్తుల కొనుగోలు మొదలైన విధానాలకు అనుగుణంగా ప్రణాళికలను సవరించాల్సి రావడమే ఇందుకు కారణం.
ముందస్తు ప్రణాళికల ప్రకారం కేజీ–డీ5 బ్లాక్ నుంచి 2019 జూన్ నాటికి గ్యాస్, 2020 మార్చి నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సవరించిన వాటిని బట్టి గ్యాస్ ఉత్పత్తి 2019 డిసెంబర్ నాటికి, చమురు ఉత్పత్తి 2021 మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కొత్త తేదీలను కొన్ని నెలల క్రితమే నిర్ణయించినట్లు, జూన్ 29 నాటి సమావేశంలో బోర్డు ఆమోదానికి సమర్పించినట్లు ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఆఫ్‌షోర్) రాజేశ్ కక్కర్ తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌కి పక్కనే గల కేజీ–డీ5 బ్లాక్ దాదాపు 7,294.6 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. దీన్ని ఉత్తర డిస్కవరీ ఏరియా (ఎన్‌డీఏ–3,800.6 చ.కి.మీ.) దక్షిణ డిస్క వరీ ఏరియా (ఎస్‌డీఏ–3,494 చ.కి.మీ.) కింద విభజించారు.
ఎన్‌డీఏలో 11 చమురు, గ్యాస్ నిక్షేపా లు ఉండగా, ఎస్‌డీఏలో ఏకైక అల్ట్రా–డీప్ సీ బ్లాకు యూడీ–1 ఉంది. వీటన్నింటినీ క్లస్టర్–ఐ, క్లస్టర్–ఐఐ, క్లస్టర్–ఐఐఐ కింద వర్గీకరించారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో వివాదం నేపథ్యంలో క్లస్టర్– ఐ నుంచి ఉత్పత్తి జోలికెళ్లడం లేదు. రెండో క్లస్టర్‌నే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రెండోసారి..: కేజీ–డీ5 బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించే డెడ్‌లైన్ వాయిదాపడటం ఇది రెండోసారి. 2014 ప్రణాళికల ప్రకారం గ్యాస్ ఉత్పత్తి 2018 నుంచి, చమురు ఉత్పత్తి 2019 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సముద్ర గర్భ క్షేత్రాల నుంచి వెలికితీసే ఇంధనాలకు ప్రభుత్వం లాభసాటి రేటును నిర్దేశించే దాకా పెట్టుబడి పణ్రాళికను ఓఎన్‌జీసీ వాయిదా వేసింది. 2016లో ప్రభుత్వం రేటు ను నిర్దేశించిన తర్వాత 5.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment