పెప్పర్‌ట్యాప్.. ఇక నో డెలివరీ!
17 నెలల్లోనే సేవలకు స్వస్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రాసరీ డెలివరీ సంస్థ పెప్పర్‌ట్యాప్ తన సేవలను ముగించేసింది. కస్టమర్లను ఆకర్షించటంలో విఫలంచెందడం, ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సిరావటం, భాగస్వామ్య దుకాణదారులు తమ యాప్ వినియోగంలో వెనకబడి ఉండటం వంటివి తమ వైఫల్యానికి కారణమని పెప్పర్‌ట్యాప్ సీఈఓ నవ్‌నీత్ సింగ్ చెప్పారు. ఈ విధమైన నిర్ణయంపై తాము ఎలాంటి అనుభూతులకు లోనుకావట్లేదని, ఆలస్యమైతే మరింత ఆగాధంలో పడే ప్రమాదముందని, కనీసం పెట్టుబడిదారుల నిధులనైనా సంరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2014లో ప్రారంభమైన పెప్పర్‌ట్యాప్ 40 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. స్నాప్‌డీల్, సిక్వోయా ఇండియా, సైఫ్ పార్టనర్స్, రు-నెట్, బీనెక్ట్స్, జెఫ్‌కో ఏసియా వంటి పెట్టుబడిదారులున్నారిందులో. ‘‘ఇప్పుడిక మేము లాజిస్టిక్ వ్యాపారంపై దృష్టిసారిస్తాం. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలతో రివర్స్ లాజిస్టిక్స్ విభాగంలో పనిచేస్తున్నాం. రానున్న కొన్ని నెలల్లో డెలివరీ లాజిస్టిక్స్ మీద దృష్టిసారిస్తామని నవ్‌నీత్ చెప్పారు.
గతేడాది బెంగళూరు కేంద్రంగా పనిచేసే డెలివరీ స్టార్టప్ జిఫ్‌స్టోర్‌ను పెప్పర్‌టాప్ కొనుగోలు చేసిన సమయంలోనే పెప్పర్‌టాప్ ఇబ్బందుల్లో ఉందని.. ఈ విషయమై మాట్లాడేందుకు పెప్పర్ ట్యాప్‌లో ఇన్వెస్టరైన స్నాప్‌డీల్ ప్రతినిధి తిరస్కరించారు. పెప్పర్‌ట్యాప్ మొత్తం 200 మంది ఉద్యోగులకు గాను 150 మందిని తొలగించేసింది. మిగిలిన 50 మంది ఉద్యోగులు లాజిస్టిక్ వ్యాపారంపై దృష్టిసారించారని సింగ్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం..
‘‘మేం సంస్థను ప్రారంభించక ముందే అంటే 2013 నవంబర్‌లో సిక్వోయా క్యాపిటల్ 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో కో-ఫౌండర్ మిలింద్ శర్మతో కలిసి 2014 సెప్టెంబర్‌లో గుర్గావ్ కేంద్రంగా పెప్పర్‌టాప్.కామ్‌ను ప్రారంభించామని’’ గతంలో సాక్షి స్టార్టప్ డైరీకి ఇచ్చిన ఇంటర్య్వూలో నవ్‌నీత్ సింగ్ చెప్పారు. తమ సంస్థ మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 20 శాతం వరకుంటుందన్నారు. ‘‘రోజుకు హైదరాబాద్ నుంచి 15% ఆర్డర్లొస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రూ.6-7 వేలొస్తున్నాయని ఆయన వివరించారు.