‘క్విక్‌’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా | Sakshi
Sakshi News home page

‘క్విక్‌’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా

Published Sun, Apr 14 2024 5:26 AM

Competing grocery stores with quick delivery - Sakshi

వేగం పుంజుకోకుంటే పచారీ కొట్లకు గడ్డుకాలమే

సాక్షి, హైదరాబాద్‌: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్‌పేస్ట్‌లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్‌ (క్యూ)–కామర్స్‌ ద్వారా ’ఆన్‌–డిమాండ్‌ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి.

చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్‌ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్‌ బా స్కెట్‌), జొమాటో(బ్లింకిట్‌), ఇన్‌స్టా మార్ట్‌ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్‌ బిజినెస్‌ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్‌ ఫుడ్‌ నుంచి ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ వరకు.. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ నుంచి ఆన్‌–డిమాండ్‌ స్ట్రీమింగ్‌ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు.

ఈ–కామర్స్, క్యూ–కామర్స్‌ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్‌ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్‌ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్‌ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్‌ అందిస్తున్న ఈ–కామర్స్‌ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు.  

సాంకేతికత సాయంతో సత్వరమే... 
క్యూ–కామర్స్‌ ఆన్‌–డిమాండ్‌ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్‌ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్‌లను కూడా ఉపయోగిస్తున్నాయి, 

కచ్చితమైన డిమాండ్‌ అంచనా  
క్యూ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్‌ లెరి్నంగ్‌ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్‌ డిమాండ్‌ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్‌ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్‌ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్‌–డిమాండ్‌ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్‌ కామర్స్‌ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి.

క్విక్‌ కామర్స్‌ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్‌–లోకల్‌ మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్‌ కామర్స్‌ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్‌ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్‌లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది.

పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు 
దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్‌లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్‌ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్‌లైన్‌ కమ్యూనిటీ నైబర్‌హుడ్‌షాప్స్‌ కిరణ్‌క్లబ్‌ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్‌ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు.  

► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. 
► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్‌డేట్స్‌ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు 
వంటివి అందుబాటులోకి తెస్తున్నారు.  
► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్‌ యాజమానులు నిమగ్నమయ్యారు.  
► క్యూ–కామర్స్‌ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు.

Advertisement
Advertisement