
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ షాపింగ్.. ఈ రోజుల్లో ఎవ్వరికీ పరిచయం అక్కర్లేదు. కానీ, మెట్రో, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ–షాపింగ్‌ను పల్లెలకూ తీసుకెళ్తోంది లింక్ స్టోర్. ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ షాపింగ్‌లో సహకరించడమే దీని ప్రత్యేకత. ఒక్క ఫ్యాషన్, అపెరల్స్ వంటి షాపింగ్‌కే పరిమితం కాకుండా... మందులు, ట్రావెల్ టికెట్లు కూడా బుకింగ్ చేసుకునే వీలుంటుందీ స్టోర్‌లో. సంస్థ ప్రారంభం, విస్తరణ గురించి లింక్ స్టోర్ ఫౌండర్ శ్రీరామ్ జూలూరు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశా. తరవాత అమెజాన్, ఉబర్ వంటి సంస్థల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. విధుల్లో భాగంగా తెలిసిందేంటంటే పేరుకే పెద్ద ఆన్‌లైన్ సంస్థలు గానీ.. గ్రామాలు, పల్లెల నుంచి ఆర్డర్లు తక్కువగా ఉంటున్నాయని! ఆయా ప్రాంతాలకు ఆన్‌లైన్ సేవలను విస్తరించాలనే యోచనలో భాగంగానే లింక్ స్టోర్‌కు బీజం పడింది. మిత్రులు అనిరుధ్ రాయపోలు, అరుణ్ తేజ బుక్కాపారపుతో కలసి... రూ.2 లక్షల పెట్టుబడితో కృష్ణా జిల్లాలోని తిరువూరులో జనవరి 2016లో లింక్‌స్టోర్‌ను ప్రారంభించాం.
ఏపీ, తెలంగాణల్లో 450 స్టోర్లు..
షాపింగ్ కోసం అమెజాన్, మందుల కోసం నెట్‌మెడ్స్, ట్రావెల్ సేవల కోసం వయా.కామ్‌తో ఒప్పందం చేసుకున్నాం. 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో లింక్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 450 లింక్ స్టోర్లున్నాయి. ప్రతి స్టోర్‌కూ ఒప్పంద సంస్థల అనుమతి తప్పనిసరి. స్టోర్‌కు వచ్చిన కస్టమర్ అడిగిన ఉత్పత్తి, ధరలను బట్టి రకరకాల బ్రాండ్లు, ఆఫర్లు, గ్యారంటీ, ఇతరత్రా అంశాలను వివరిస్తాం. కస్టమర్ ఎంపికను బట్టి ఉత్పత్తులు ఇంటికి డెలివరీ అయ్యాక.. నగదు తీసుకుంటాం. డెలివరీ బాధ్యత ఒప్పంద సంస్థలదే. లింక్ స్టోర్‌లో రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కస్టమర్లకు ముందే ఆయా ఉత్పత్తుల గురించి వివరిస్తాం గనక. మా మొత్తం విక్రయాల్లో రిటర్న్స్ వాటా 1 శాతం కంటే తక్కువే.
రూ.లక్షకే ఫ్రాంచైజీ; 100 చ.అ.ల్లో స్టోర్..
ఆన్‌లైన్ వ్యాపారంపై ఆసక్తి, ఇంటర్నెట్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.లక్ష ఖర్చవుతుంది. ఇందులో రూ.20 వేలు ఫీజు. మిగిలిన మొత్తాన్ని స్టోర్ డిజైనింగ్, కంప్యూటర్, టీవీ వంటి ఉపకరణాల కొనుగోలు కోసం వెచ్చిస్తాం. ప్రతి నెలా వచ్చిన మొత్తంలో 10% రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో స్టోర్ 100–150 చ.అ.ల్లో ఉంటుంది. ఒప్పంద సంస్థలు, లింక్ స్టోర్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ స్టోర్‌ను డిజైన్ చేస్తాం. ఒప్పంద సంస్థలకు లింక్‌స్టోర్ నుంచే ఆర్డరొచ్చిందని ఎలా తెలుస్తుందంటే.. ఫ్రాంచైజీ తాలూకు కంప్యూటర్, మొబైల్‌లో లింక్‌స్టోర్ ట్రాకింగ్ టూల్స్, ప్లగ్గిన్స్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తాం. ప్రతి స్టోర్‌కు ఒప్పంద సంస్థల ఐడీ ఉంటుంది. దీంతో ఏ స్టోర్ నుంచి ఆర్డరొచ్చిందో తెలిసిపోతుంది.
నెలకు రూ.8 కోట్ల జీఎంవీ..: ప్రతి ఉత్పత్తి అమ్మకంపై ఒప్పంద సంస్థ నుంచి కమీషన్ తీసుకుంటాం. మొబైల్స్‌పై 3%, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 4%, ఫ్యాషన్ ఉత్పత్తులపై 15% వరకుంటుంది. ప్రస్తుతం లింక్ స్టోర్ల నుంచి రోజుకు 1,000 ఆర్డర్లొస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 3.5 లక్షల ఆర్డర్లను పూర్తి చేశాం. నెలకు మా ఒప్పంద సంస్థలకు రూ.8 కోట్ల గ్రాస్ మర్చండేస్ వ్యాల్యూ (జీఎంవీ) చేసి ఇస్తున్నాం. ఇందులో 95% జీఎంవీ ఒక్క అమెజాన్‌దే. కమీషన్ రూపంలో లింక్ స్టోర్ ఆదాయం నెలకు రూ.30 లక్షల వరకుంటుంది. ఒక్కో స్టోర్ ఫ్రాంచైజర్ నెలకు రూ.30–40 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
మెట్రో, డీమార్ట్, వాల్‌మార్ట్‌లతో ఒప్పందం..
వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీ, తెలంగాణల్లో 1,000 లింక్ స్టోర్లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. వారం రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్, కేరళలో లింక్ స్టోర్లను ప్రారంభించనున్నాం. ఇప్పటికే 50 స్టోర్లను ఫ్రాంచైజీ తీసుకున్నారు. మరో 2 నెలల్లో తమిళనాడు, కర్ణాటకకు విస్తరించనున్నాం. త్వరలోనే లింక్ స్టోర్లలో ఫిజికల్‌గా గ్రాసరీ, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించాం. ఇందుకోసం మెట్రో, డీమార్ట్, వాల్‌మార్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో విజయవాడ కేంద్రంగా 15 స్టోర్లను ప్రారంభిస్తాం. బీమా, మనీ ట్రాన్స్‌ఫర్ విభాగాల్లోనూ సేవలందిస్తాం. 2018 ముగింపు నాటికి రూ.15 కోట్ల నిధులను సమీకరించాలని లకి‡్ష్యంచాం.
Comments
Please login to add a commentAdd a comment